ఏపీలో సకల శాఖల మంత్రి.. సర్వాంతర్యామి...!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా సరే... ముందుగా ఆయనే స్పందిస్తారు. ఇక ఏ సమస్య అయినా సరే... ఆయనే పరిష్కరిస్తారు. ఇక ఏ సమస్య అయినా సరే... ఆయన హామీ ఇచ్చారంటే... ఇట్టే జరిగిపోతుంది. ప్రతిపక్షాలు చేసే విమర్శలకైనా... ప్రభుత్వం అమలు చేసే పథకాల గురించి అయినా... కోర్టు ఇచ్చే తీర్పుల గురించి అయినా.... ఇలా ఏ టాపిక్ అయినా సరే... ఆయనే సర్వాంతర్యామి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించే సమీక్షలకు హాజరు కాకపోయినా కూడా.... ప్రతి విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరిస్తారు. ప్రభుత్వం అమలు చేసే పథకాల గురించి ఫుల్ క్లారిటీగా వివరిస్తారు. ప్రభుత్వ పనితీరుపై ఎవరైనా విమర్శలు చేస్తే... ఎదురు దాడి చేస్తారు కూడా. రాజకీయ విమర్శలు, పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ అధికారులతో చర్చలు, పార్టీ నేతలతో మంతనాలు, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు... ఇలా ఏదైనా సరే... అన్ని విషయాలు ఆయన్ను దాటి ముందుకు వెళ్లటం లేదు. ప్రతి విషయంలో ఆయన ప్రమేయం ఉండాల్సిందే.
సజ్జల రామకృష్ణా రెడ్డి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేయాలని అనుకుంటే... అందుకు సంబంధించిన సలహాలు, సూచనలు చేసేందుకు మాత్రమే ఈ పదవిని ఏర్పాటు చేశారు. కానీ సజ్జల రామకృష్ణా రెడ్డి మాత్రం... అంతకు మించి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అన్ని విషయాలను పరిశీలిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పర్యవేక్షిస్తున్నారు కూడా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కంటే సజ్జలే ఎక్కువ సార్లు మాట్లాడారు. ఇక ఉద్యోగులు ప్రెస్ మీట్ పెడితే... నేరుగా వారికే ఫోన్ చేసి కంట్రోల్‌లో ఉండాలని చెప్పేశారు. ఇక బొగ్గు కొరత వల్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతే... విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కంటే ముందే ఆయన స్పందించారు. విద్యుత్ వాడకం తగ్గించాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఉద్యోగులతో రెవెన్యూ మంత్రి నిర్వహించాల్సిన సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు హోదాలో హాజరయ్యారు. మీ సమస్యలు పరిష్కారించే పూచీ నాదీ అంటూ హామీ కూడా ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు అంతా కూడా ఆయన్ను సజ్జల సకల శాఖ మంత్రిగా అభివర్ణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: