కృష్ణా జల వివాదంపై కేసీఆర్ మెలిక... గెజిట్ అమలవుతుందా...?

Podili Ravindranath
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదురుతోంది. జల వివాదాలకు పరిష్కారంగా కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రస్తుతం అనుమానంగానే కనిపిస్తోంది. ఇందుకు ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే అని తెలుస్తోంది. కృష్ణా నదీ జలాల పంపకం, ప్రాజెక్టుల నిర్వాహణ బాధ్యతను కేంద్రమే చేపట్టాలంటూ గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్ర జల శక్తి శాఖ... గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది కూడా. అయితే దీనిపై మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతూనే ఉంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా అప్పగించాల్సిన అవుట్ లెట్లను అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నో చెప్పేసింది. కృష్ణా రివర్ బోర్డు మేనేజ్‌మెంట్‌కు అప్పగించాల్సిన ప్రాజెక్టుల అవుట్ లెట్లపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎలాంటి జీవోలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంతలోనే తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది.
కేంద్ర జల శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై అధ్యయనం చేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తర్వాత... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన, నిర్మించబోతున్న ప్రాజెక్టులపై రాష్ట్ర విభజన ముందు నుంచే వివాదాలు ఉన్నాయి. ప్రధానంగా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పధకంపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఇప్పటికే సుప్రీం కోర్టులో, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో కూడా ఫిర్యాదు చేసింది కేసీఆర్ సర్కార్. అదే సమయంలో ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలతో సంబంధం లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో చేసేది లేక... తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేంద్రానికి జగన్ సర్కార్ ఫిర్యాదు చేసింది. జగన్ లేఖపై స్పందించిన కేంద్రం... కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా తమ పరిధిలోకి తీసుకుంటీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రివర్ బోర్డు పరిదిలోకి రెండు రాష్ట్రాల్లోని కృష్ణా నది ప్రాజెక్టులు తప్పనిసరిగా తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: