బ‌తుక‌మ్మ సంబురం ఏం నేర్పింది?

RATNA KISHORE

కేసీఆర్ ఒక‌ప్పుడు బ‌తుక‌మ్మ పాట‌ను తెలంగాణ ఉద్య‌మానికి వాడుకున్నారు. ఓ భావోద్వేగాన్ని పంచుకున్నారు. పాట‌తోనూ ఆట‌తోనూ తెలంగాణ సంస్కృతిని వర్థిల్లేలా చేసిన గొప్ప పండుగ బ‌తుక‌మ్మ అని ప్ర‌పంచానికి చాటారు. ఆయ‌న కుమార్తె క‌విత నేతృత్వాన తెలంగాణ జాగృతిని స్థాపింప‌జేసి, వాడ‌వ‌డ‌లా బ‌తుక‌మ్మ పండుగ‌ను వేడుక‌గా నిర్వ‌హించారు. ఆ సంప్ర‌దాయం నేటికీ ఉన్నా ఒక‌ప్ప‌టి స్థాయి ఇప్పుడు లేదు. పాల‌న‌లో ఉన్న వైఫ‌ల్యాలే ఇప్పుడు బ‌తుకు పాట అవుతున్నాయి. వీటిపై పాల‌కుల స్పంద‌న ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డం విచార‌క‌రం.

ఆట పాట‌ల పండుగ..బుజ్జి త‌ల్లుల పండుగ.. పెద్ద ముత్తైదువల పండుగ..బ‌తుకు ఇచ్చు పండుగ..బ‌తుక‌మ్మ‌..తెలంగాణ నేల‌పై ఎంతో పేరున్న సంస్కృతికి చిహ్నం ఈ పండుగ. మ‌రి! స‌ద్దుల బ‌తుక‌మ్మ‌తో పండుగ ముగిసింది. ఈవేళ పండుగ ఏం నేర్పింది? అన్న‌ది ఇప్ప‌టి ప్రశ్న. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని ద‌శ‌దిశ‌లా చాటేందుకు పాట ముఖ్య‌మ‌యిన భూమిక పోషించింది. అదే రీతిన ఈ సారి కూడా అనేక పాట‌లు రూపొందాయి. ఏఆర్ రెహ్మాన్ రూపొందించిన పాట మాత్రం వివాదాల‌కు నెల‌వైంది. మిట్ట‌ప‌ల్లి సురేంద‌ర్ రాసిన పాట  పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. ఇక ష‌ర్మిల నేతృత్వంలో మ‌రో పాట రూపొందింది. ఏపూరి సోమ‌న్న నేతృత్వంలో త‌యారైన ఈ పాట ప్ర‌భుత్వ తీరుపై నిర‌స‌న స్వ‌రం వినిపించింది. ఇవి  కాకుండా మ‌రికొన్ని ప్ర‌యివేటు పాట‌లు వ‌చ్చాయి. కొన్ని బాగున్నాయి. కొన్ని బాలేదు. అన్నింటి క‌న్నా క‌న‌క‌వ్వ పాట కాస్త బాగుంద‌న్న‌టాక్ తో న‌డిచింది.


 పాట  ఎలా ఉన్నా తెలంగాణ సంస్కృతిని చాటే క్ర‌మంలో కొంత వెనుక‌బాటులోనే ఉంది. అర్థం లేని వ‌ర్ణ‌న‌లు, బ్యాండ్ బాజాల‌తో కొన్ని పాట‌లు మోతెక్కించిన మాట కూడా వాస్త‌వం.పాట మ‌ధ్య‌లో డీజే ద‌రువులు  కూడాపెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి..అవ‌న్నీ ఎందుకు ఇదివ‌ర‌కు బ‌తుక‌మ్మ పాట ఇలా ఉందా అన్న అనుమానం రేగేలా కొన్ని పాట‌లు రూపుద్దిద్దుకున్నాయి. ఇవ‌న్నీ ఓ ఎత్త‌యితే స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వం స్పందించ‌కుండా పెద్ద పెద్ద క‌ళాకారుల‌తో పాట‌లు త‌యారు చేయిస్తే ఏం లాభం అన్న బాధ కూడా వినిపించింది. మొత్తానికి బ‌తుక‌మ్మ తొమ్మిది రోజుల పాటు ఆనందాల‌ను, ఆవేద‌న‌ల‌నూ అన్నింటిని విని చివ‌ర‌కు గంగ‌మ్మ ఒడికి చేరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: