ఆ స్టార్ క్యాంపైనర్లతో హుజూర్ కాంగ్రెస్ పుంజుకుంటుందా..?

MOHAN BABU
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. హుజరాబాద్ లో ఆ ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు,రాజకీయ విశ్లేషకులు ఊహించారు. కానీ ఇంత కాలం వరకు కాంగ్రెస్ హుజురాబాద్ పై ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు భారీ బృందంతో రంగంలోకి దిగుతుంది. 20 మందితో కూడిన క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది అధిష్టానం. పార్టీ విడుదల చేసిన జాబితాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అలాగే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి,అలాగే శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి,దామోదర రాజనర్సింహ, మధు యాష్కి తదితరులు ఉన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి, టిఆర్ఎస్ మద్యే ప్రధాన పోటీ ఉంటుందనే భావన వినిపిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తుంది.

 తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో ఆయన సారథ్యంలో హుజురాబాద్ లో ఎలాంటి ఫలితం వస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే రేవంత్ రెడ్డి కి ఈ ఎన్నికల్లో సీనియర్లు ఎంతవరకూ సహకరిస్తారు అనేదానిపై కూడా కొంత కాలంగా ఉత్కంఠ నెలకొంది. పలువురు సీనియర్లు ఇప్పటికే రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్నారనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఆయనకు సహకరించేందుకు ఎంతమంది నేతలతో కలసి వస్తారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు వంటి వాళ్లు సహకరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వారికి ఎన్నికల బాధ్యతను కూడా టిపిసిసి అప్పగించింది. ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన తెలంగాణ పి సి సి ముఖ్యనేతల సమావేశం ఆశించిన  విధంగానే సాగడం పై కాంగ్రెస్ శ్రేణులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డికి,సీనియర్లకు మధ్య ఉన్న గ్యాప్ తగ్గించేందుకు హుజురాబాద్ ఉప ఎన్నిక ఉపయోగపడుతుందనే టాక్ నడుస్తుంది.

మరోవైపు ఇక తెలంగాణ పీసీసీ తరఫున రేవంత్ రెడ్డికి కాస్త దూరంగా ఉంటున్న వారి జాబితాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కొంత మంది మాత్రమే ఉన్నారని త్వరలోనే వాళ్లు కూడా రేవంత్ రెడ్డి తో కలిసి పనిచేసే అవకాశం లేక పోలేదని కాంగ్రెస్ లోని కొందరు చర్చించుకుంటున్నారు. ఒకవేళ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీ అనుకున్న స్థాయిలో ఓట్లు సాధిస్తే ఆ పార్టీ శ్రేణులు, నేతల్లో రేవంత్ రెడ్డి పట్ల నమ్మకం మరింతగా పెరుగుతుందని  పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: