కృష్ణా జిల్లా మంత్రులు వారేనా...!

Podili Ravindranath
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తైంది. తొలి శాసన సభాపక్ష సమావేశంలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చేశారు. తమ ప్రభుత్వంలో రెండు మంత్రివర్గాలు ఉంటాయని... తొలి అర్థభాగం ఒకటి.... ఆ తర్వాత రెండున్నర ఏళ్లు మరో మంత్రివర్గం ఉంటుందని చెప్పేశారు. పదవులు రాని వారు ఎలాంటి అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్పేశారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అవకాశం వస్తుందన్నారు. అన్నట్లుగానే రెండున్నర ఏళ్ల పాటు కేబినెట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. మంత్రులపై ఆరోపణలు వచ్చినా కూడా... జగన్ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు రెండో మంత్రి వర్గ ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది. మరో నెల రోజుల్లో కొత్త మంత్రులు పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో ఆశావహుల్లో ఆత్రం ఎక్కువైపోయింది. ఎవరికి పార్టీ అధినేత అవకాశం ఇస్తాడో అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం కృష్ణా జిల్లా నేతల పరిస్థితి ఇలానే ఉంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు కోసం ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. జగన్‌కు అత్యంత ఆప్తుడుగా పేరున్న కొడాలి నానితో పాటు మరో నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కేబినెట్‌లో కొనసాగుతున్నాడు. అయితే... ప్రస్తుత మంత్రివర్గ మార్పులో వెల్లంపల్లి శ్రీనివాస్‌పై వేటు తప్పదని అంతా భావిస్తున్నారు. ఆయన స్థానంలో విజయవాడ నగరానికే చెందిన మరో నేత మల్లాది విష్ణుకు అవకాశం ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అందులో భాగంగానే బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి విష్ణును తప్పించారనేది నేతల మాట. అలాగే మరో సీనియర్ నేత కొలుసు పార్థసారథి కూడా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా గుర్తింపున్న పార్థసారథి... ఆయన కేబినెట్‌లో మంత్రిగా కూడా వ్యవహరించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనకు పదవి దక్కుతుందని ఆశ పడ్డారు. కానీ టీటీడీ బోర్డు మెంబర్‌తో సరిపెట్టారు జగన్. దీనిపై అప్పట్లోనే కొలుసు వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే రెండో విడతలో తప్పకుండా అమాత్య పదవి దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు పార్థసారథి. జిల్లాలో ఈ ఇద్దరు నేతలకే బెర్తు ఖరారైనట్లు ఇప్పటికే పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: