గుడివాడ చుట్టూనే రాజకీయం..!

Podili Ravindranath
రెండు రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన అంశం గుడివాడ నియోజకవర్గం. ఇంకా చెప్పాలంటే... ప్రస్తుతం ఏ ఇద్దరి మధ్యలో అయినా సరే... గుడివాడ గురించే ప్రస్తావన. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల గడువు ఉన్నా కూడా... ప్రతి ఒక్కరు చర్చించుకునే అంశం... గుడివాడలో ఎవరు గెలుస్తారో చూడాలి అని. అంతగా ఆసక్తి రేపేలా తయారైంది కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ రాజకీయం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వయంగా పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం. అటు సామాజిక వర్గం పరంగా కూడా గుడివాడ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. ముందు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి వెంకటేశ్వర్రావు.... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగా గుర్తింపు పొందారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కూడా ఒంటికాలితో దూకుతున్నారు.
అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలతో ఢీ అంటే ఢీ అంటున్నారు కొడాలి నాని. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి గుడివాడలో సరైన నాయకుడు లేడనేది జగమెరిగిన సత్యం. ఎన్నికల్లో పోటీ చేసేది లేదని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు తేల్చి చెప్పాడు. 2019 ఎన్నికల్లో బాలకృష్ణ స్వయంగా గుడివాడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే బాలయ్య మాత్రం.. తన నియోజకవర్గం హిందూపురం వదిలి బయటకు రాలేదు. దీంతో దిక్కులేని పరిస్థితుల్లో విజయవాడ నుంచి దేవినేని అవినాష్‌ను గుడివాడకు పంపారు చంద్రబాబు. ప్రచారంలో పర్లేదనిపించిన అవినాష్.. ఓట్లు రాబట్టడంలో విఫలమయ్యాడు. ఎన్నికల్లో ఓటమి తర్వాత... ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా మళ్లీ విజయవాడ వెళ్లిపోయి... అధికార వైసీపీకి మద్దతు తెలిపారు. దీంతో ప్రస్తుతం గుడివాడలో తిరుగులేని నేతగా మారారు కొడాలి నాని. ఈ పరిస్థితుల్లో నానిని ఢీ కొట్టాలంటే... అందుకు సరైన వ్యక్తిగా వంగవీటి రాధాను ఎంపిక చేశారు చంద్రబాబు. టార్గెట్ 2024 అంటూ ఓ భారీ ప్రణాళిక రూపొందించిన చంద్రబాబు... అందులో భాగంగా రెండున్నరేళ్ల ముందే వంగవీటి రాధాను గుడివాడకు పంపేశారు. ఇద్దరు మిత్రుల మధ్య రాజకీయ యుద్ధం ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: