వాటిపై మాత్రమే టీటీడీకి ఎందుకంత నిర్లక్ష్యం...?

Podili Ravindranath
కరోనా చేసిన కల్లోలం నుంచి అన్ని వ్యవస్థలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ జోరుగా జరుగుతున్న సమయంలో... దాదాపు అన్ని కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా రవాణా వ్యవస్థ, దేవాలయాలు ఇలా అన్ని వ్యవస్థలు యధావిధిగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వైపు నైట్ కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికీ... కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... పండుగలు, వేడుకలు నిర్వహించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
కరోనా కారణంగా గతేడాది మార్చి నెలలోనే అన్ని దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. అలాగే టీటీడీ అనుబంధ దేవాలయాలతో పాటు.. ధార్మిక కార్యక్రమాలను కూడా టీటీడీ నిలిపివేసింది. దాదాపు మూడు నెలల తర్వాత పరిమత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ ఆలయాల్లో దర్శనాలను టీటీడీ ప్రారంభించింది. అలాగే... వర్చువల్ సేవలు కొనసాగిస్తోంది. 300 రూపాయల దర్శనానికి మాత్రమే ముందు నుంచి అనుమతిస్తున్న టీటీడీ... తాజాగా సర్వ దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించింది. ఇన్ని చేస్తున్నా... ప్రజలకు అందుబాటులో ఉండే కల్యాణ మండపాలను మాత్రం టీటీడీ ఇంకా తెరవటం లేదు. ప్రజలకు అనుకూలంగా, తక్కువ ధరకు టీటీడీ కల్యాణ మండపాలను అద్దెకు ఇస్తుంది. ఇందులో వివాహదీ శుభకార్యాలు చేసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. నామ మాత్రపు ధరతో పాటు... స్వామి వారి సమక్షంలో వివాహం జరిగిందనే సంతృప్తి కూడా భక్తులకు కలుగుతుంది. కరోనా సాకుతో టీటీడీ మాత్రం కల్యాణ మండపాలను ప్రారంభించడం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని టీటీడీ కల్యాణమండపాలు నిరుపయోగంగా ఉన్నాయి. అదే అద్దెకు ఇవ్వడం వల్ల టీటీడీపై ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. మండపాలు తెరవాలని టీటీడీకి ఇప్పటికే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నప్పటికీ... అధికారులు మాత్రం కనీసం స్పందించడం లేదు.  ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి... కల్యాణ మండపాలను తిరిగి ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు. ప్రైవేటు కల్యాణ మండపాలు ఆర్థికంగా భారం కావడం వల్ల మధ్య తరగతి ప్రజలకు టీటీడీ కల్యాణ మండపాలు ఎంతో ఉపయోగకరంగా కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

TTD

సంబంధిత వార్తలు: