పాపం పాకిస్తాన్... ఎటూ కాకుండా పోయింది...!

Podili Ravindranath
ఊరంతా ఓ వైపు ఉంటే.... తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటాడు మూర్ఖుడు. ప్రస్తుతం ఈ సామెత భారత్ దాయాది దేశమైన పాకిస్తాన్‌కు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచమంతా తాలిబన్లను వ్యతిరేకిస్తుంటే... పాకిస్తాన్ మాత్రం తాలిబన్ చర్యలు సమర్థించింది. ఆఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమిస్తే... ఇదే సరైన చర్య అంటూ సంబరాలు కూడా జరుపుకుంది పాకిస్తాన్. ఉగ్రవాదంపై పోరుకు అన్ని దేశాలు ఏకమవుతుంటే... పాకిస్తాన్ మాత్రం.... తమ దేశంలో తీవ్రవాదులే లేరని బుకాయించింది. ఉన్నారని అగ్రరాజ్యం ఉగ్రవాదుల జాబితా రిలీజ్ చేస్తే... లేదు అదంతా మాపై చేసే ఆరోపణలు మాత్రమే అని కొట్టిపారేస్తుంది కూడా.  ఇక కశ్మీర్‌ విషయంలో భారత్‌పై ఒంటికాలుతో లేస్తోంది పాకిస్తాన్. ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా కూడా... మళ్లీ మళ్లీ దాడులు చేస్తోంది.
తాలిబన్లకు అండగా నిలిచిన పాకిస్తాన్‌పై ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్లకు ఇప్పట్లో అంతర్జాతీయ గుర్తింపు లభించేలా లేదు. సార్క్ దేశాల సమావేశానికి హాజరయ్యేందుకు తీవ్రంగా కృషి చేసిన తాలిబన్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సార్క్ దేశాల జాబితాలో తాలిబన్ల పరిపాలనలో ఉన్న ఆఫ్ఘాన్ సర్కార్‌ను కూడా చేర్చుకోవాలన్న పాకిస్తాన్ డిమాండ్‌ను సభ్య దేశాలు తోసిపుచ్చాయి. ఏకాభిప్రాయం రాకపోవడంతో... తాలిబన్లకు మద్దతు ఇచ్చినందుకు దాయాది దేశానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ప్రస్తుతం తాలిబన్ ప్రభుత్వంలో అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్తులు... మంత్రులుగా ఉన్నారు. ఇదే ఇప్పుడు తాలిబన్లకు పెద్ద తలనొప్పిగా మారింది. అంతర్జాతీయంగా తమకు గుర్తింపు ఇవ్వాలంటూ తాలిబన్లు చేసుకున్న విజ్ఞప్తిని సార్క్ దేశాలు తోసిపుచ్చాయి. చైనా, రష్యా, పాకిస్తాన్ దేశాలు తమకు మద్దతుగా ఉండటంతో... గుర్తింపు పెద్ద కష్టం కాదనుకున్నారు తాలిబన్లు. కానీ మిగిలిన దేశాలు వ్యతిరేకించడంతో... ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఐక్యరాజ్యసమితిలో ప్రసగించేందుకు తాలిబన్ల తరఫున రాయబారిగా సొహైల్ షహీన్‌కు మాత్రం అవకాశం దక్కింది. అంతే తప్ప ప్రస్తుత ఆఫ్ఘన్ ప్రధాని, ఉప ప్రధానికి మాత్రం ఎలాంటి ఆహ్వానం అందలేదు. భారత ఉపఖండం పరిధిలోని సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి కూడా తాలిబన్లకు ఆహ్వానం దక్కలేదు. ఇందుకు సార్క్ సభ్య దేశాలు చెప్పిన ఏకైక కారణం ఉగ్రవాద బ్యాక్‌గ్రౌండ్. దీంతో అంతర్జాతీయ గుర్తింపు కోసం తాలిబన్లు నానా పాట్లు పడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: