శ్రీ‌కాకుళం వార్త : స‌రిహ‌ద్దు వివాదం తేల‌ని సంవాదం?

RATNA KISHORE

మంత్రి సీదిరి అప్ప‌ల్రాజుకు స‌వాలుతో కూడిన రాజ‌కీయ ప‌రిణామం ఏఓబీలో నెల‌కొంది. ప్ర‌శాంత‌త‌కు ఆన‌వాలుగా నిలిచే ప్రాంతం పై ఒడిశా స‌ర్కారు ప‌ట్టు పెంచుకోవాల‌ని చూస్తోంది. దీనిపై ఒడిశా బీజేపీ మాట్లాడుతుంది కానీ ఆంధ్రా బీజేపీ గొంతు వినిపించ‌డం లేదు. ప్రాంతాల ఉద్వేగాలు ఎలా ఉన్నా రాజ‌కీయ ఉద్దేశాలు మాత్రం త‌మ ప‌ట్టుకు ఎదురులేద‌న్న విధంగా నిరూపించుకోవాల‌న్న త‌ప‌న మాత్రం స్ప‌ష్టం అవుతోంది.




సుదీర్ఘ అనుబంధం ఆంధ్రా - ఒడిశాది. సంస్కృతుల్లో కూడా అలాంటి అనుబంధ‌మే ఉత్త‌రాంధ్ర ప‌ల్లెల‌తో కొన‌సాగుతోంది. ప‌లాస, మంద‌స‌, మెళియాపుట్టి, క‌విటి, కంచిలి, ఇచ్ఛాపురం త‌దిత‌ర ప్రాంతాల‌లో ఆంధ్రా - ఒడిశా సంస్కృతి మ‌మేకం అయి ఉంటుంది. ఉద్దానం నేల‌లో ఈ సంస్కృతి కార‌ణంగానే మంచి అనుబంధాలు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్నాయ‌న్న‌ది వాస్త‌వం. ఇక్క‌డ ఒక‌రి పండుగ‌లు ఇంకొక‌రు చేసుకుంటారు.  వివాహ బంధంతో అటు కుటుంబం ఇటు కుటుంబం ఒకే గూటికి చేరుకుంటుంది. ఆహార‌పు అల‌వాట్లు కూడా రెండు ప్రాంతాల‌కూ ఒకే విధంగా ఉంటుంది. చ‌దువు వెనుకంజ‌లో ఉన్నా చైత‌న్యం ముందంజ‌లో ఉన్న నేల‌ల‌వి. ఏఓబీగా పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తారు. వీరికి ఇది చాలా కీల‌కం.




న‌క్స‌ల్  మూమెంట్ కు ఇది ఒక షెల్ట‌ర్ జోన్. ఇలాంటి చారిత్ర‌క ప్రాంతంలో రాజ‌కీయ వివాదాలు కొత్త మ‌లుపు తీసుకుంటు న్నాయి. ఎన్న‌డూలేనంతంగా స‌రిహ‌ద్దు నేల‌లు మావి అంటే మావి అని గొడ‌వ‌కు దిగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో నిన్న‌టి వేళ కేంద్ర బృందాలు ప‌ర్య‌టించాయి. వివాదానికి కార‌ణం అయిన మంద‌స మండ‌లం, మాణిక్య ప‌ట్నం, గుడ్డికోల గ్రామాల‌ను సంద‌ర్శించి, ప్ర‌జాభిప్రాయం సేక‌రించాయి. ఈ బృందం ప‌ర్య‌ట‌నతో అమిత‌మ‌యిన ఆస‌క్తి జిల్లాలో నెల‌కొంది. ఎక్కువ మంది గిరిజ‌నులు తాము మొద‌టి నుంచి ఆంధ్రాలోనే ఉంటామ‌ని అంటున్నారు. అదే మాట కేంద్ర బృందం ద‌గ్గ‌ర కూడా చెప్పారు.



ఈ నేప‌థ్యంలో మాణిక్య‌ప‌ట్నంలో విలువైన సహ‌జ వ‌న‌రులు అపారంగా ఉండడంతోనే ఒడిశా దీనిపై క‌న్నేసింద‌ని మంత్రి సీదిరి అంటున్నారు. తమ భూభాగాల‌ను వ‌దులుకునే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. సీనియ‌ర్ నేత మ‌జ్జి తుల‌సిదాసు విగ్ర‌హావిష్క రణ నిన్న‌టి వేళ జ‌రిగింది. ఈ వేడుక‌కు విచ్చేసిన మంత్రి తాజా వివాదంపై క్లారిఫికేష‌న్ ఇచ్చారు. ఒడిశా అధికారులు త‌మ ప్రాంత ప్ర‌జ‌లను భ‌య‌పెట్టినా, తాను వారికి అండ‌గా ఉంటాన‌ని మ‌రో సారి స్ప‌ష్టం చేశారు. స‌మ‌గ్ర స‌ర్వే చేయించేందుకు కేంద్రం త‌రుఫున బృందాలు ర‌ప్పించేందుకు కూడా సిద్ధ‌మేనని గ‌తంలో చెప్పిన మాట‌నే పున‌రుద్ఘాటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: