మోడీకి ఎదురెళ్తున్న బాబు... ?

Satya
చంద్రబాబు రాజకీయం బహు చిత్రంగా ఉంటుంది. ఆయన ఒకసారి చేసిన తప్పుని మళ్లీ చేయరు. అసలు ఆయన రిస్క్ కి పోరు కూడా. రాజకీయన్ని పూర్తిగా ఔపోశన పట్టేసిన చంద్రబాబు ఆప్షన్లు అన్నీ తన వద్దనే ఉంచుకుంటారు. ఎటు నుంచి ఏమొచ్చినా రాజకీయ లాభం తనకే ఉండాలని కూడా ఆలోచిస్తారు.
సరే. చంద్రబాబు ఎంతలా ఆలోచించినా కూడా 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఆయన పార్టీ దారుణమైన ఫలితాలను చవిచూసింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో జగన్ చరిష్మా ఎలా ఉన్నా మోడీకి, బీజేపీకి దూరం కావడం కూడా ప్రధాన  కారణం అని కూడా విశ్లేషణ ఉంది. దాంతోనే చంద్రబాబు ఎన్నికలు అయిపోగానే బీజేపీని పల్లెత్తు మాట అనకుండా ఉంటూ వస్తున్నారని చెబుతారు. అలాగే ఆయన బీజేపీతో చెలిమి కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ చెలిమికి బీజేపీలో ఒక వర్గం అడ్డుపడుతోంది.
ఇవన్నీ పక్కాన పెడితే దేశవ్యాప్తంగా మోడీ గ్రాఫ్ బాగా పడిపోతోంది. ఇక మోడీతో కలిస్తే రేపటి రోజున ఎన్నికల్లో  ఫలితాలు ఎలా ఉంటాయో అన్న బెంగ కూడా ఎప్పటి నుంచో ఉన్న మిత్రులలో ఉంది. దాంతో మోడీతో కొత్త స్నేహాన్ని కలపాలనుకుంటూ ఇంతకాలం ఆలోచించిన చంద్రబాబు ఇపుడు వేరేగా థింక్ చేస్తున్నారు అన్న చర్చ అయితే ఉంది. ఈ నెల 27న భారత్ బంద్ కి దేశంలోని రైతు సంఘాలు వామపక్షాలు  పిలుపు ఇచ్చాయి. దానికి జాతీయ స్థాయిలో విపక్ష కూటమి కూడా మద్దతుగా నిలిచింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి కంటే ముందుగా మద్దతు ప్రకటించింది చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ.
అంటే మోడీకి యాంటీగా జరుగుతున్న బంద్ కి బాబు జై కొట్టారన్న మాట. మరి ఇది బాబు భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న కీలకమైన నిర్ణయంగా చూడాలా అన్న చర్చ అయితే ఉంది. ఎందుకంటే మోడీ గ్రాఫ్ ఒక వైపు తగ్గడం, జాతీయ స్థాయిలో విపక్షాలు బలపడడం, ఇంకో వైపు రైతుల సమస్య మీద జరుగుతున్న బంద్ కాబట్టి మద్దతు ఇస్తే ఆ వర్గాలు అనుకూలంగా ఉంటాయన్న ఆలోచనతోనే బాబు ఇలా చేశారని కూడా అంటున్నారు. అయితే ఇప్పటికిపుడు బాబు బీజేపీకి డైరెక్ట్ గా గుడ్ బై కొట్టారని, రానున్న రోజుల్లో ఈ విధంగా సంకేతాలు ఇస్తూ 2023 చివరి నాటికి తన స్టాండ్ ఏంటో చెబుతారని అంటున్నారు. మొత్తానికి యూపీ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కనుక గెలవకపోతే కచ్చితంగా యాంటీ మోడీ స్టాండ్ ని బాబు తీసుకుంటారని, జాతీయ స్థాయిలో గట్టిగానే ఈసారి చక్రం తిప్పుతారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: