శ్రీ‌కాకుళం వార్త : ఫ్యాను స్పీడు పెరిగింది .. కానీ?

RATNA KISHORE

జిల్లాలో వైసీపీకి అనూహ్య ఫ‌లితాలు వ‌చ్చాయి. బాగుంది. ఒక‌నాటి రాజ‌కీయం మారిపోయింది. కానీ ఇదే గెలుపును అంతిమంగా అనుకోకుండా ప‌నిచేయాలి. అదేవిధంగా క్షేత్ర స్థాయిలో రాణించేందుకు కృషి చేయాలి. ఇప్పుడు జెడ్పీ పీఠం పిరియా విజ‌య (బ‌లిజ సామాజిక‌వ‌ర్గం) కు వ‌రించ‌నుంది. ఆమె భ‌ర్త పిరియా సాయిరాజు కాళింగ సామాజిక‌వ‌ర్గం. తెర‌వెనుక ఉండి న‌డిపేది ఆయ‌నే! అన్న‌ది సుస్ప‌ష్టం. జిల్లాలో మ‌రో సారి కాళింగుల ఆధిప‌త్యం రుజువైనా ఇదే హ‌వా రానున్న ఎన్నిక‌ల్లోనూ చూపిస్తే బాగుంటుంది. జ‌గ‌న్ కూడా సీతారాం కు, దువ్వాడకు, సాయిరాజుకు మంచి ప్రాధాన్యం ఇచ్చాడు. ఆ ప్ర‌భావం ఎలా ఉండ‌బోతోంది? వైసీపీ గెలిచినా కానీ చేయాల్సిన ప‌నులు చేయ‌కుండా రోజులు లెక్కిస్తే కుద‌రని ప‌ని. గ్రామీణ ర‌హ‌దారుల అభివృద్ధిపై ఆ రోజు ఎర్ర‌న్న ఎంతో ఫోక‌స్ చేశారు. ఆయ‌న ప్ర‌భావం ఇప్ప‌టికీ ఉద్దానంలో ఉంది. రక్షిత మంచినీటి ప‌థ‌కం కింద ఉద్దానం దాహార్తి తీర్చారు. అంత‌టి స్థాయిలో వైసీపీ ప‌నిచేయాలి. చేస్తుందా?



శ్రీ‌కాకుళం జిల్లాలో ప‌లు స్థానాల్లో జెడ్పీటీసీలు మంచి మెజార్టీ ద‌క్కించుకోవ‌డంతో వైసీపీ ఆనందంలో మునిగి తేలుతోంది. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్య‌లు ఉన్న చోట కూడా వైసీపీ మంచి మెజార్జీలు ద‌క్కించుకుంది. ఎంపీటీసీ స్థానాలు కూడా ఆశించిన విధంగానే బాగున్నాయి. టెక్క‌లి, ఇచ్ఛాపురం ఈ రెండే జిల్లాలో టీడీపీ నియోజ‌క‌వ‌ర్గాలు. ఇక్క‌డ జెడ్పీటీసీలు రెండూ వైసీపీవే.


ముఖ్యంగా వైసీపీ త‌ర‌ఫున టెక్క‌లిలో పోటీచేసిన దువ్వాడ వాణి 22 వేల ఓట్ల‌కు పైగా మెజార్టీ సాధించి, మాజీ మంత్రి అచ్చెన్న‌కు చుక్క‌లు చూపించారు. ఆయ‌న మొన్న‌టి ఎన్నిక‌ల్లో సాధించిన మెజార్టీ క‌న్నా ఇది మూడు రెట్లు ఎక్కువ‌ని వైసీపీ మీడియా చెబుతోంది. దువ్వాడ వాణి గెలుపున‌కు ఆమె భ‌ర్త శ్రీ‌ను చేసిన కృషి ఈ సారి ఫ‌లించింది. గ‌తంలోనూ ఆమె జెడ్పీటీసీగా ప‌నిచేసిన దాఖ‌లాలు ఉన్నాయి. జ‌గ‌న్ కుటుంబానికి విధేయులుగా ఉండ‌డంతో ఆమె గెలుపు చాలా సులువు అయింద‌ని కూడా కొంద‌రు అంటున్నారు. అదేవిధంగా ఇచ్ఛాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న క‌విటి మండ‌లం జెడ్పీటీసీగా ఎన్నికైన పిరియా విజ‌య కూడా మంచి మెజార్టీ ద‌క్కించుకున్నారు. 18699 ఓట్ల తేడాతో ఆమె గెలుపు సాధించారు. పిరియా విజ‌య కూడా మంచి నాయ‌కురాలు. భ‌ర్త సాయిరాజుకు మంచి పేరుంది. వీరిద్దిరిదీ ప్రేమ వివాహం. సాయి రాజు మొన్నటి వేళ డీసీఎంఎస్ చైర్మ‌న్ ప‌ద‌వి నిర్వ‌హించారు. ప‌ద‌వీ కాలం ముగియ‌గానే  జెడ్పీ పీఠం ఆయ‌న భార్య‌ను వ‌రించ‌నుంది.



సాయి రాజు, దువ్వాడ శ్రీ‌ను ఇద్ద‌రూ ఒకే గూటి ప‌క్షులు అయిన‌ప్ప‌టికీ ఒకే సామాజిక‌వ‌ర్గం అయిన‌ప్ప‌టికీ అప్ప‌టిదాకా ఉన్న రాజ‌కీయాలు వైఎస్సార్ మ‌ర‌ణం త‌రువాత మారిపోయాయి. ఎర్ర‌న్న మ‌ర‌ణం త‌రువాత ఆయన విధేయుడిగా పేరున్న సాయిరాజు (అప్పట్లో ఎర్ర‌న్న ఆశీర్వాదంతోనే ఇచ్ఛాపురం ఎమ్మెల్యేగా గెలుపు సాధించారు) వైసీపీ గూటికి చేరారు. అన‌తి కాలంలోనే మంచిపేరు తెచ్చుకున్నారు. స్వ‌త‌హాగా ఈ ఇద్ద‌రూ ఆవేశ‌ప‌రులు. దువ్వాడ కుటుంబానికి అచ్చెన్న కుటుంబంతో వైరం ఉన్నా సాయి రాజు కు మాత్రం ఆ వైరం అన్న‌ది లేనే లేదు. ఇప్ప‌టికీ ఆయ‌న ఎర్ర‌న్నాయుడు కుటుంబంపై వ్యాఖ్య‌లు చేయ‌రు. మ‌రో ముఖ్య విష‌యం  ఏంటంటే ఆయ‌న మంత్రి సీదిరి అప్ప‌ల్రాజుకు స‌న్నిహితంగా ఉంటారు. అంతేకాదు దువ్వాడ క‌న్నా సోష‌ల్ స‌ర్వీస్ యాక్టివిటీస్  సాయిరాజుకే ఎక్కువ. ప‌వ‌న్ కు  ఓవిధంగా ప‌ట్టున్న ప్రాంతం ఇది. అయినా కూడా ఆయ‌న జన‌సేన పిల్ల‌ల‌పై  పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌రు. కొన్ని విష‌యాల్లో సాయి రాజు, దువ్వాడ శ్రీ‌ను క‌న్నా హుందాగా ఉంటారు. స‌మైక్యాంధ్ర పోరాటాల్లో  ఓ సారి తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ఏదేమైనా విశాఖ‌లో ఓ కాంట్రాక్టరు ఇటుగా రావ‌డం అనూహ్యం. ఇదంతా ఎర్ర‌న్న ప్ర‌సాదించిన జీవితం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: