హైదరాబాదీల సరికొత్త డిమాండ్...!

Podili Ravindranath
ప్రస్తుతం ఏ వస్తువు కావాలన్నా కూడా అంతా ఆన్‌లైన్. అలా ఆర్డర్ చేస్తే... ఇలా డెలవరీ చేస్తారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలు మొదలు... లోకల్ యాప్‌ల వరకు ఎన్నో మరెన్నో సంస్థలు ప్రజలకు ఆన్‌లైన్‌లో సేవలు అందిస్తున్నాయి. సూపర్ మార్కెట్లు మొదలు... చిన్న చిన్న కిరాణా షాపులు కూడా ఆర్డర్ ఇస్తే చాలు.. అలా సరుకులను ఇంటికి తెచ్చేస్తున్నాయి. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... టెక్కీలంతా కూడా ఆన్‌లైన్ సర్వీసులపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. పని ఒత్తిడి కారణంగా... బజారుకు వెళ్లి షాపింగు పేరుతో సమయం ఎందుకు వృధా చేయడం అని కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. అందుకే సరదా కోసం సినిమా హాల్‌కు వెళ్లడం కంటే... అదే కొత్త సినిమాను ఇంట్లోనే ఓటీటీలో చూస్తే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారు.
అయితే దాదాపు అన్ని వస్తువులు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి కానీ... కొన్నిటి కోసం మాత్రం తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తుంది. వాటిలో ప్రధానమైనది మద్యం. ప్రస్తుతం మందు కావాలంటే తప్పనిసరిగా వైన్ షాపుకు వెళ్లాలి... లేదా బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లి తాగాల్సిందే. అది కూడా నిర్ణీత సమయంలోనే. ఆ గడువు దాటితే అన్నీ క్లోజ్. వైన్ షాపు ముందు అలా అందరిలో నిలుచుని మందు కొనాలంటే చాలా మందికి చిన్నతనం. సిగ్గు కూడా. ఇక బార్ అండ్ రెస్టారెంట్‌లో కూర్చుంటే... వాళ్లు వేసే బిల్లులు కట్టాల్సిందే. ఆ తర్వాత ఇంటికి వెళ్లాలంటే నానా పాట్లు పడాల్సిందే. పోలీసులకు భయపడుతూ... డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు దొరక్కుండా... ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలి. ఈ గోల అంతా ఎందుకు... మద్యం కూడా ఆన్‌లైన్‌లో హోమ్ డెలవరీ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది ఈ మధ్య కాలంలో.
ఇప్పటికే పంజాబ్, న్యూఢిల్లీ, పుదుచ్ఛేరి, బెంగాల్, మాహారాష్ట్ర, అసోం రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌లో మద్యం అందిస్తున్నారు. ఇదే బెటర్ అని మరికొన్ని రాష్ట్రాలు కూడా భావిస్తున్నాయి. తెలంగాణలో కూడా ఇదే విధానం అమలు చేయాలనే డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది. ఇంటర్‌నేషనల్ స్పిరిట్ అండ్ వైన్స్ అసోసియేషిన్ ఆఫ్ ఇండియా తాజాగా నిర్వహించిన సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. ప్రతి ఒక్కరు కూడా లిక్కర్ హోమ్ డెలివరీ... చేస్తేనే బెటర్ అని సూచించారు. మరి ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: