ప‌వ‌ర్ పాలిటిక్స్ ప‌నిచేయ‌లేదు.. బీజేపీ దూర‌మే!

VUYYURU SUBHASH
రాష్ట్రంలో బీజేపీ-జ‌న‌సేన బంధం తెగిపోవ‌డం ఖాయ‌మేనా?  ఇక‌, మున్ముందు.. జ‌న‌సేన బీజేపీకి దూర‌మ‌వుతుందా? అంటే.. బీజేపీ నాయ‌కులే ఔన‌ని అంటున్నారు. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు.. 2019లో బీజేపీని తిట్టిపోయిన ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ళ్యాణ్ అనూహ్యంగా ఆపార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే.. ఈ పొత్తు.. రెండు పార్ట‌ల‌కు ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని.. వ‌చ్చే 2024 లేదా దీనికి ముందే క‌నుక ఎన్నిక‌లు జ‌రిగితే.. త‌మ‌కు లాభిస్తుంద‌ని.. అధికారంలోకి కూడా వ‌చ్చేసి.. కాపు నాయ‌కుడిని ముఖ్య‌మంత్రిపీఠం ఎక్కిస్తామ‌ని.. బీజేపీ నాయ‌కులు ఉవ్విళ్లూరారు. అయితే.. అదేం ప‌రిస్థితో కానీ.. ఈ మిత్ర‌త్వం.. ఈ రెండు పార్టీల‌కూ క‌లిసి రాలేదు.
బీజేపీకి జ‌న‌సేన తోడ‌న్నారు.. మాకు మీరు సాయం అందించాల‌ని.. జ‌న‌సేన నేత‌లు చెప్పారు. ఇవి కేవ‌లం మాట‌లు మాత్ర‌మే మిగిల్చాయి. ఆది నుంచి కూడా నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లోపించింది. ఫ‌లితంగా నాయ‌కులు నాయ‌కులుగానే ఉండగా.. క్షేత్ర‌స్థాయి లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు.. బీజేపీ కార్య‌క‌ర్త‌లు.. ఎవ‌రిదారి వారిదే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనికి కొన్నాళ్ల కింద‌ట వెలుగు చూసిన‌.. పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఒక నిద‌ర్శ‌నం. అయితే.. అప్ప‌ట్లో.. తూచ్‌.. ఇలాంటిది గ్రామాల్లో స‌ర్వ‌సాధార‌ణం.. అని బీజేపీ నేత‌లు తోసిపుచ్చారు. అంతేకాదు.. అప్ప‌ట్లో టీడీపీకి .. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నేత‌లు మ‌ద్ద‌తివ్వ‌డాన్ని లైట్ తీసుకున్నారు. ఇక‌, జ‌న‌సేన కూడా టీడీపీతో లోపాయికారీ.. ఒప్పందం చేసుకుంద‌నే వాద‌న‌పై మిన్నంటిన మౌనాన్ని పాటించింది.
ఇక‌, ఇప్పుడు మ‌రోసారి.. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో.. జ‌న‌సేన-బీజేపీ ల మ‌ద్య ఏమేర‌కు మిత్ర‌త్వం కొన‌సాగిందో స్ప‌ష్ట‌మైంది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను టీడీపీ త్య‌జించినా.. జ‌న‌సేన‌.. బీజేపీ క‌లిసి పోటీకి దిగుతామ‌ని చెప్పినా.. క్షేత్ర‌స్థాయిలో భిన్న‌మైన రాజ‌కీయం చోటు చేసుకుంది. టీడీపీ కార్య‌క‌ర్త‌లు.. జ‌న‌సేన‌కు స‌హ‌క‌రించారు. జ‌న‌సేన నాయ‌కులు.. టీడీపీతో చేతులు క‌లిపారు. వెర‌సి.. బీజేపీ మొత్తం ఖాళీ అయింది. కేవ‌లం మూడు ఎంపీటీసీ స్థానాల్లో విజ‌యం త‌ప్ప‌.. ఇప్పుడు సోము వీర్రాజు సాధించిన ప్ర‌గ‌తి భూత‌ద్దం పెట్టి వెతికినా.. క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు. జ‌నసేన నుంచి కూడా బీజేపీకి మ‌ద్ద‌తు ల‌భించ‌లేద‌నే విష‌యంస్ప‌ష్టంగా తెలిసి పోయింది. ఈ ప‌రిణామాలు ఇలా .. ఉంటే.. టీడీపీతో జ‌న‌సేన చేతులు క‌లిపే స్ప‌ష్ట‌మైన ప‌రిస్తితి వ‌చ్చింది.
గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంట మండ‌లాల్లో.. టీడీపీకి వ‌చ్చిన మెజారిటీకి.. జ‌న‌సేన చేతులు క‌లిపి తే.. ఈ రెండు పార్టీలూ క‌లిపి.. ఎంపీపీ పీఠాన్ని ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. దీనికి ఈ రెండు పార్టీలూ సిద్ధ‌మా? అంటే.. తాజా గా అందుతున్న స‌మాచారాన్ని బ‌ట్టి.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి.. జ‌న‌సేన‌తో స‌ర్దుబాటు చేసుకుంటామ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అంటే.. జ‌న‌సేన‌తో టీడీపీ బంధం పెన‌వేసుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామ‌మే.. ఇప్పుడు బీజేపీని ఇర‌కాటంలో ప‌డేసింది. వ‌ద్ద‌ని చెప్ప‌లేరు.. అలాగ‌ని మౌనంగా ఉండ‌లేరు.. ఇప్పుడు కింక‌ర్త‌వ్యం? అనేది ఈ పార్టీ నేత‌ల ఆలోచ‌న‌. ఇదిలావుంటే.. ప‌రిశీల‌కులు మాత్రం ఇక‌, బీజేపీ-జ‌న‌సేన దూరం కావ‌డ‌మే బెట‌ర్ అని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: