భాగ్యనగరంపై అధికారులకు ఎందుకింత నిర్లక్ష్యం...?

Podili Ravindranath
ఈ నగరానికి ఏమైంది... ఓ వైపు నుసి... మరోవైపు పొగ... ఈ మాట ప్రతి సినిమా ప్రారంభంలో వినిపిస్తుంది. ఇప్పుడు ఇదే మాట హైదరాబాద్ నగరానికి కూడా వర్తిస్తుంది. ఓ వైపు రోజు రోజుకూ పెరుగుతున్న జనాభా... మరోవైపు కాలుష్యం. ఇప్పటికే ప్రపంచ పటంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నగరం హైదరాబాద్. సుమారు 40 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే మహా నగరం... రోజు రోజుకూ విస్తరిస్తోంది. కానీ మౌళిక వసతుల కల్పనలో మాత్రం అధికారులు కాస్త నిర్లక్ష్యం వహిస్తున్నారు.
భాగ్యనగర వాసులకు ఒకటే భయం. ప్రతి ఏడాది వర్షాకాలం వస్తుందంటే చాలు... అసలు బయట కాలు పెట్టాలంటే భయపడాల్సిందే. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా చెప్పాలంటే... బయటకు వెళ్లిన వాళ్లు సురక్షితంగా తిరిగి వస్తారో లేదో కూడా తెలియని భయం. చిన్నపాటి వర్షానికి నగరంలోని అన్ని దార్లు కూడా కాలువలను తలపిస్తాయి. రోడ్లేవో, కాలువలు ఏవో కూడా తేడా తెలియనంత దుస్థితి. ఈ మధ్య కాలంలో అయితే ఆక్రమణలు పెరిగిపోవడంతో... కొంతమంది రోడ్లపై ఈత కూడా కొడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా.. అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. గతేడాది కురిసిన భారీ వర్షానికి కాలనీలు కాలనీలు మునిగిపోయాయి. ప్రజలు బోట్లు వేసుకుని ప్రయాణించారు. కొన్ని కాలనీలు అయితే వారం రోజుల వరకు నీటి ముంపులోనే ఉండిపోయాయి. అప్పట్లో మంత్రులు, అధికారులు కూడా ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. మరోసారి ఈ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నాలాలపై ఆక్రమణలు తొలగిస్తామన్నారు. కానీ ఇదంతా కేవలం హామీలకే పరిమితమయ్యాయి. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ వర్షాకాలం వచ్చే సరికి... ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు, పొంగిపొర్లుతున్న నాలాలు. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో... భరించలేనంత దుర్వాసన, అంటు రోగాలు, దోమల బెడత. ఇప్పటికే కరోనా వైరస్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నగర వాసులను ప్రస్తుతం డెంగీ భూతం పట్టిపీడిస్తోంది. ఇప్పటికైనా అధికారులు మేల్కోని... హైదరాబాద్‌ను విశ్వ నగరం స్థాయికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: