పరిషత్‌ ఫలితాలపై ప్రజల మాటేంటి!?

N.Hari
ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రజలకు పెద్దగా పట్టలేదా? ఫలితం ఎలా ఉంటుందో ముందే తెలుసు కనుకే.. రిజల్ట్‌ వచ్చిన రోజున వారు అంతగా ఆసక్తి కనబరచలేదా? ఎప్పుడో ఎన్నికలు జరిగిన తర్వాత లెక్కింపు జరగడం వారిలోని అనాసక్తికి కారణమా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచే వివాదం మొదలైంది. కోర్టు కేసులు, రీ నోటిఫికేషన్లతో ఎన్నికల నిర్వహణ తర్వాత ఓట్ల లెక్కింపుకు చాలా సమయం పట్టింది. పరిషత్ ఎన్నికల ఫలితాలంటే సహాజంగానే గ్రామాల్లోని ఓటర్లు ఎక్కువ శ్రద్ధ చూపుతారు. తమ ప్రాంతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీగా ఎవరు గెలిచారో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే, ఈసారి ఏపీలో పరిషత్ ఎన్నికల ఫలితాలపై ప్రజల తీరు దీనికి భిన్నంగా ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపుపై గానీ, ఫలితాలపై గానీ రాష్ట్రంలోని ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఉదయం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు దగ్గర నుంచే ఎన్నికల ఫలితాలపై గ్రామాల్లో చర్చ జరుగుతుండేది. అయితే, దీనికి భిన్నంగా పరిషత్ ఎన్నికల ఫలితాలపై ప్రజలతో పార్టీలు, నేతలు సైతం పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.
రాష్ట్రంలో పరిషత్ ఓట్ల లెక్కింపు సమయంలో జరిగిన సంఘటనలు కూడా.. ఈసారి ప్రజలు ఫలితాలపై అంతగా ఆసక్తి చూపకపోవడానికి కారణమని తెలుస్తోంది. కరోనా నిబంధనలను అనుసరించి, ఏజెంట్స్‌కు కరోనా పాజిటివ్ వస్తే వారిని కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి పంపేశారు. ఆ స్థానంలో కొత్తగా మరో వ్యక్తికి కరోనా టెస్టులు నిర్వహించి, వారిని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించారు. అయితే, ఆ వ్యక్తులపై ఎలాంటి కేసులు లేకుండా.. వారి ట్రాక్ రికార్డును కూడా చెక్ చేసిన తర్వాతే, ఏజెంట్స్ గా అనుమతించారు. కొన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఈ కార్యక్రమం మొత్తం అయ్యే సరికి.. ఓట్ల లెక్కింపు ప్రారంభించడం ఆలస్యమైంది.  
ఇక ఏంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగి చాలా రోజులు కావడంతో పాటు ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించడం కూడా.. పరిషత్ ఫలితాలపై ప్రజల్లో పెద్దగా ఆసక్తి లేకపోవడానికి కారణం కావచ్చనే చర్చ జరుగుతోంది. ఓట్ల కౌంటింగ్ ఎప్పుడు జరిగినా ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయనే ప్రచారం ముందు నుంచే జరిగింది. దీంతో ఈసారి ఎన్నికలు కూడా పెద్ద రసవత్తరంగా జరగలేదు. మెజార్టీ స్థానాల్లో పోటీ కూడా బలంగా లేకపోవడంతో.. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్ధులే ఎక్కువ చోట్ల గెలుస్తారని అందరూ ముందు నుంచే లెక్కలేసుకున్నారు. దీంతో ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు సమాచారం తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదన్న చర్చ జోరుగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: