చినబాబు గారు... హైదరాబాద్‌లో ఏం చేస్తున్నారో...?

Podili Ravindranath
2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం తర్వాత... పార్టీ అధినేత హైదరాబాద్ నగరానికే పరిమితం అయ్యారు. ఏదో అప్పడుప్పుడు చుట్టం చూపుగా అమరావతి వచ్చి... మళ్లీ సాయంత్రానికి తిరిగి వెళ్లిపోతున్నారు. ఇదే విధానం దాదాపు ఏడాదిన్నర పాటు కొనసాగించారు. అధికార పార్టీ నేతల ఆరోపణలు, సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి... కార్యకర్తల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో చివరికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి తన వైఖరిని మార్చుకున్నారు. ప్రతి నెలలో రెండు వారాల పాటు అమరావతిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఐదు రోజుల పాటు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు చంద్రబాబు.
అయితే పార్టీ అధినేత అయితే... కార్యకర్తల కోసం రాష్ట్రంలోనే ఉంటున్నారు... కానీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం కనిపించటం లేదు. చివరికి సొంత నియోజకవర్గం మంగళగిరి ప్రజలకు ఇచ్చిన మాట కూడా లోకేష్ నిలబెట్టుకోవటం లేదు. ఎన్నికల్లో ఓటమి అనంతరం.. పార్టీ కార్యాలయం ప్రారంభించిన నారా లోకేష్.... మంగళగిరి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉటానని... ఎవరైనా... ఏ సమయంలో అయినా సరే తనను స్వయంగా కలిసి సమస్యలు తెలియచేయవచ్చన్నారు లోకేష్. కానీ ఈ మాట నీటి మూటగానే మిగిలిపోయింది. ఏదైనా పార్టీకి సంబంధించిన కార్యక్రమం, ఎవరైనా నేత పరామర్శ.. అంతే తప్ప... కనీసం పట్టుమని ఓ 24 గంటలు కూడా ఏపీ ప్రజల కోసం కేటాయించలేకపోతున్నారు. అలా హైదరాబాద్ నుంచి వచ్చి... ఇలా రెండు ప్రెస్ మీట్‌లు పెట్టి... ఆ వెంటనే మళ్లీ భాగ్యనగరం వెళ్లిపోతున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నారా లోకేష్ ఏపీలో ఉంటే... పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అనే భయం పట్టుకుందేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వ హాయంలో జరిగిన ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ పై లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే నాటి ఉన్నతాధికారి సాంబశివరావును అరెస్ట్ కూడా చేశారు. నాటి ఐటీ శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన నారా లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అందుకే చిన్నబాబు.. హైదరాబాద్ వదిలి వచ్చేందుకు భయపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: