జనసేనాని ఏమయ్యారో...?

Podili Ravindranath
2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ ప్రారంభించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్... ప్రస్తుతం ఏమయ్యారు.. రాజకీయాల్లో మార్పు తెస్తామని ప్రకటించిన సేనాని... చివరికి తానే మారిపోయారా... ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి స్పందించే చిన్న సారు.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు... 2009 ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేసిన పవన్ కల్యాణ్...  ఆ పార్టీకి అనుబంధంగా యువరాజ్యం అంటూ మరో విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆవేశపూరితమైన ప్రసంగాలతో... 2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. ఒక దశలో ప్రస్తుతం రాజకీయ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కూడా.
ఎన్నికల ఫలితాల్లో ప్రజారాజ్యం ఆశలు గల్లంతయ్యాయి. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అదే సమయంలో రాజకీయాల్లో పెను మార్పులు రావడంతో... ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు మెగాస్టార్. ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీతో కలిసేందుకు విముఖత చూపిన పవన్ కల్యాణ్ మాత్రం... అన్నకు దూరంగానే ఉన్నారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో 2014లో జనసేన అంటూ కొత్త పార్టీ స్థాపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావించినప్పటికీ... అదేం జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు మద్దతు ప్రకటించారు. ఆ పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేశారు. ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీతో విభేదించారు. అంతటితో ఊరుకోకుండా... కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. జనసేనాని కూడా రెండు చోట్ల పోటీ చేశారు. కానీ గెలవలేకపోయారు.
ఆ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. టార్గెట్ 2024 అంటూ అందరికీ దిశా నిర్దేశం కూడా చేశారు. కానీ అంతలోనే సినిమాల వైపు మొగ్గు చూపారు. దీంతో పార్టీలో కీలక నేతలు దూరమయ్యారు కూడా. పవన్ కనిపిస్తే సీఎం సీఎం అంటూ గోల చేసే ఫ్యాన్స్ మాత్రం... ఆ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే... తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక. బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ తరఫున ప్రచారం చేసిన సమయంలో భారీ ఎత్తున పవన్ అభిమానులు హాజరయ్యారు. కానీ ఓట్లు మాత్రం అందులో సగం కూడా రాలేదు. ఏదో అప్పుడప్పుడు కనిపించే పవన్ మాత్రం... ఇప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. వరుసగా మూడు సినిమాల షూటింగ్‌తో పవన్ బిజీ అయిపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీ పరిస్థితి ఏమిటీ అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల పరిస్థితి. ఇప్పటికే చాలా సార్లు సొంత పార్టీ అభిమానులే గుసగుసలాడుతున్నారు... అసలు జనసేనాని ఏమయ్యారో అని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: