మంత్రి సీదిరికి మ‌రో స‌వాలు : ఒడిశాపై మాట్లాడండి మినిస్ట‌ర్ ?

RATNA KISHORE

జ‌గ‌న్ ప్ర‌భుత్వంకు అస్స‌లు మాట్లాడే చొర‌వెందుకు లేదు. స‌రిహ‌ద్దు జ‌ల వివాదాల‌ను ప‌రిష్క‌రించుకునే స‌త్తా ఎందుకు లేదు. కేంద్రం మాట్లాడ‌దు క‌నుక మాట్లాడాల్సిన రాష్ట్ర ప్ర‌భుత్వాలే ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంలో భాగంగా ఒక‌రి బాధ మ‌రొక‌రు పంచుకోవాలి.


ఎగువ నుంచి దిగువ కు నీళ్లు చేరితే ప్రాజెక్టుల మ‌నుగ‌డ. ఎక్క‌డి నీరు అక్క‌డ అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా ఆపుద‌ల చేసి నిల్వ చేసేందుకు స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటుచేసుకుంటే ఇప్ప‌టికైతే న‌ష్ట‌పోయేది ఉత్త‌రాంధ్ర‌నే లేదా దిగువ ప్రాంత‌మే! శ్రీ‌కాకుళం జిల్లా రైతుల క‌ల‌ల‌ను సాకారం చేసే ప్రాజెక్టు వంశ‌ధార. కానీ ఇప్పుడీ క‌ల క‌ల‌త‌ల‌కు నెల‌వ‌వుతోంది. సాఫీగాసాగాల్సిన నేర‌డి బ్యారేజీ ప‌నులు అస్స‌లు మొద‌ట్లోనే ఆగిపోబోతున్నాయి. మంత్రి సీదిరి ఏం మాట్లాడ‌తారు దీనిపై? న్యాయ‌పోరు మొద‌లైతే మ‌ళ్లీ కాల‌యాప‌న త‌ప్ప ఇరు రాష్ట్రాలూ సాధించేది ఏమీ ఉండ‌దు.


19.05 టీఎంసీల నీరు నిల్వ చేస్తేనే వంశ‌ధార ప్రాజెక్టుకు సార్థ‌క‌త. అందుకు ఇప్పుడు నిర్మించిన సైడ్ వియ‌ర్ స‌రిపోదు అద‌నంగా నేర‌డి ద‌గ్గ‌ర బ్యారేజీ నిర్మించాలి.. ఇదీ నిపుణులు చెబుతున్న మాట. అయితే ఒడిశా మాత్రం అప్ప‌టిలా లేదు. మొండి ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఎగువ నీరు త‌మ‌కు తోచిన రీతిన ఆపేయాల‌ని అనుకుంటోంది. ఇప్పుడు జ‌గ‌న్ చొర‌వ చూపి ఒడిశాతో మాట్లాడాలి. లేదా ఆయ‌న త‌ర‌ఫు మంత్రుల క‌మిటీ ఒక‌టి వేసి, ప్ర‌భుత్వ దూత‌లుగా ఒడిశా ప్ర‌భుత్వంతో మాట్లాడే ప‌నిని పెట్టుకోవాలి. కానీ జ‌గ‌న్ కు అంత తీరిక ఉందా? లేదా అంత చొర‌వ ఉందా?


ఎగువన ప్రాజెక్టులు క‌డితే దిగువ‌న ఏమౌతుంది. ఎడారి అవుతుంది. కోట్లు ఖ‌ర్చు చేసి చేప‌ట్టిన ప్రాజెక్టులు ఏమౌతాయి ఎందుకూ ప‌నికి రాకుండా పోతాయి. ల‌క్ష్యానికి దూరంగా అవి కాలం నెట్టుకువ‌స్తాయి. ఇవేవీ కాకూడ‌దంటే స‌రిహద్దు వివాదాలు ఎవ‌రు ప‌రిష్క‌రించాలి? ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం. కానీ మాట్లాడుతుందా? లేదు మాట్లాడ‌డం లేదు. ఒడిశాకు సంబంధించి అభ్యంత‌రాల‌ను ఎవ‌రు సాల్వ్ చేయాల‌ని ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ‌మే కానీ జ‌గ‌న్ వివాదాల‌ను ప‌ట్టించుకుంటున్నారా..లేదు. మంత్రి సీదిరి అప్ప‌ల్రాజు ఏం చేస్తున్నారు. ఆయ‌నే స‌రిహ‌ద్దు విష‌యాల‌పై మాట్లాడాలి. గ‌తంలో వంశ‌ధార ప్రాజెక్టు దాని మ‌నుగ‌డ‌పై ఎవ‌రు మాట్లాడారు. మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద రావు అధికారంలో లేని రోజుల్లో ఓ రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించి మ‌రీ! ఈ ప్రాంతం గోడు వినిపించారు. ఇప్పుడు ఆయ‌న స్థానంలో ఎవ‌రు వ‌స్తారు. ధ‌ర్మాన మాట్లాడాల్సినంత మాట్లాడారు. ఇప్పుడు సీదిరి మాట్లాడితే స‌మ‌స్య ఏంట‌న్న‌ది ఎందుకన్న‌ది తేల‌నుంది. మ‌రి! మాట్లాడ‌తారా?



మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: