చింత‌ల‌పూడి టీడీపీ టిక్కెట్ కోసం మూడు ముక్క‌లాట‌... !

VUYYURU SUBHASH
 ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి ఎస్సీ రిజ‌ర్వ్ డ్ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ టిక్కెట్ కోసం అప్పుడే ఆశావాహులు వేట మొద‌లు పెట్టేశారు. 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి పీత‌ల సుజాత విజ‌యం సాధించారు. అనంత‌రం చంద్ర‌బాబు ఆమెను కేబినెట్లోకి తీసుకున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఆమె కు టిక్కెట్ రాలేదు. 2009 ఎన్నిక‌ల్లో ఓడిపోయిన క‌ర్రా రాజారావుకు సీటు ఇవ్వ‌గా ఆయ‌న 36 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఇన్ చార్జ్‌గా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం రాజారావు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఇప్పుడు పార్టీ అధిష్టానం ఇక్క‌డ కొత్త ఇన్‌చార్జ్‌ను నియ‌మించాల్సి ఉంది.

మ‌రోవైపు చంద్ర‌బాబు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్‌చార్జ్ లు లేకుండా ఖాళీగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్ చార్జ్‌ల‌ను నియ‌మిస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు చింత‌ల‌పూడి పార్టీ ప‌గ్గాలు ఎవ‌రికి ఇస్తారు ? అన్న దానిపై కాస్త ఉత్కంఠ నెల‌కొంది. మాజీ మంత్రి పీత‌ల సుజాత మ‌రోసారి త‌న‌కు పార్టీ బాధ్య‌త‌లు ఇస్తార‌న్న ధీమాతో ఉన్నారు. పార్టీ ఎప్పుడు సీటు ఇచ్చినా.. ఎప్పుడు ఇవ్వ‌క‌పోయినా ఆమె గీత దాట‌లేదు. పార్టీ కోసం ఎప్పుడూ ప‌ని చేస్తూ వ‌స్తున్నారు. అన్ని స‌మీక‌ర‌ణ‌ల‌తో పాటు ఆమె క‌మిట్‌మెంట్ ఆమెకు ప్ల‌స్ కానుంది.

ఇక జ‌డ్పీ మాజీ చైర్మ‌న్ కొక్కిరిగ‌డ్డ జ‌య‌రాజు సైతం టిక్కెట్ రేసులో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న టిక్కెట్ కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే చివ‌ర్లో సీటు ద‌క్క‌లేదు. ఇంకా చెప్పాలంటే జ‌య‌రాజు 2009 నుంచి కూడా ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ టిక్కెట్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నా... జిల్లాలో మూడు రిజ‌ర్వ్ సీట్లు ఉన్నా ఆయ‌న‌కు అదృష్టం క‌లిసి రావ‌డం లేదు. ఇక జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఆకుమ‌ర్తి రామారావు సైతం ఈ సారి టిక్కెట్ కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

నారా లోకేష్ సేవా స‌మితి ద్వారా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోన్నఆయ‌న‌కు జంగారెడ్డిగూడెం మున్సిపాల్టికి చెందిన కొంద‌రు స‌పోర్ట్ చేస్తున్నారు. మ‌రి ఈ ముగ్గురిలో పార్టీ అధిష్టానం ఎవ‌రికి పార్టీ ప‌గ్గాలు ఇస్తుందో ?  త్వ‌ర‌లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: