ఎవరూ దిగిరారు .. మరెందుకో ఉద్యమాలు ..

Chandrasekhar Reddy
రాజధానిలో రైతు ఉద్యమానికి ఏడాది దాటింది. ఈ ఉద్యమం కొత్త రైతు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో ప్రారంభం అయ్యింది. ఈ ఏడాదిలో ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎప్పుడూ రైతులు చేసే ఉద్యమాలు శాంతియుతంగా ఉండేవి కానీ ఈసారి మాత్రం రాజధాని లో ప్రారంభం అయినప్పటి నుండి ఏదో ఒక హింస జరుగుతూనే ఉంది. ఎక్కడెక్కడి నుండో వచ్చిన ఎందరో రైతులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. వీరంతా రాజధానిలోనే ఉద్యమం చేసే ప్రాంతంలోనే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని ఈ ఏడాదిగా ఉంటున్నారు. అప్పుడప్పుడు వీరితో కేంద్రం చర్చలు జరిపినప్పటికీ ఎటువంటి ఫలితం తేలకపోవడంతో ఉద్యమం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది.
అసలు కేంద్రం చేసిన కొత్త రైతు చట్టాలు ఏమిటో ఇక్కడ రైతు నాయకులకు కనీస అవగాహన ఉందా అంటే చెప్పలేం. ఒకవేళ తెలిసినా రైతుల ముసుగులో అక్కడ చేరిన రైతు నాయకులలో ఎవరు ఏ పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారో తెలియదు. కేవలం రైతు ఉద్యమం అయితే ఇటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం జరగదు అనేది వాస్తవం. ఇప్పటికే ఎందరో ఈ ఉద్యమానికి తమ వంతు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అందులో కొందరు విమర్శలకు కూడా గురయ్యారు. ఒక వేళ రైతు చట్టాలు నిరుపయోగం అయితే కేంద్రం కూడా తన పట్టు సడలించాల్సి ఉండేది. కానీ ఇటు రైతులు, అటు కేంద్రం తమ పంతం నెగ్గాలి అనుకోవడంతో ఉద్యమం కొనసాగుతూనే ఉంది.
అయితే ఎప్పుడూ కార్పొరేట్ వర్గాలకు మాత్రమే మేలుచేసే  ప్రస్తుత ప్రభుత్వం రైతులకు మేలు చేసే చట్టాలు చేసింది అంటే నమ్మడం సాధారణ ప్రజానీకానికి కూడా కష్టమే. అందుకేనేమో ప్రభుత్వము కూడా రైతు చట్టాలు ఏ మేరకు రైతులకు ఉపయోగపడతాయి అనేది ప్రజాక్షేత్రంలోకి వచ్చి చెప్పలేకపోతుంది. ఇలా దేశంలో ఎవరికి వారు ఒక వర్గానికి అతుక్కుపోతుంటే అభివృద్ధి చెందటం కలగానే మిగిలిపోతుందనేది అన్ని పక్షాలు తెలుసుకుంటే మంచిది. తాత్కాలిక నిర్ణయాలతో ప్రభుత్వాలు నిలబెట్టుకోవడం వాళ్ళు చేస్తున్న అతిపెద్ద తప్పైతే, వాళ్ళు చేసే తాత్కాలిక నిర్ణయాలను ఒప్పుకోవడం ప్రజల తప్పు అవుతుంది. ఈ రెండు లేని రోజు దేశంలో నిర్ణయాలు సరిగా ఉన్నాయని చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు. ఒక దేశప్రగతి ప్రజలు, ప్రభుత్వ సహకారం తోనే సాధ్యం రానురాను అదే ఈ దేశంలో కరువైపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: