బూతులతో మైలేజ్...వైసీపీ చెప్పిందే వేదమా?

M N Amaleswara rao
ఏపీ రాజకీయాల్లో బూతులు హల్చల్ చేస్తున్నాయి. ఒకప్పుడు నాయకుల మధ్య మాటల విమర్శలు ఉండేవి...ఇప్పుడు బూతుల విమర్శలు వచ్చాయి. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా నాయకులు బూతులతో రెచ్చిపోతున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టి‌డి‌పి నేతలు బూతులతోనే రాజకీయం నడిపిస్తున్నారు. అంటే ఎంత ఎక్కువగా బూతులు మాట్లాడితే...అంతగా తమకు మైలేజ్ వస్తుందనే విధంగా రాజకీయం చేస్తున్నారు.
రెండు పార్టీల నేతలు బూతులు మాట్లాడటంలో ఆరితేరిపోయినట్లు కనిపిస్తున్నారు. తాజాగా ఈ బూతుల యుద్ధం మరింత ఎక్కువైంది. టి‌డి‌పి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తాజాగా సి‌ఎం జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఊహించని విధంగా పరుష పదజాలంతో దూషించారు. అలాగే హోమ్ మంత్రి సుచరిత, పోలీసులని ఉద్దేశించి కూడా అయ్యన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న ఇలా మాట్లాడటంపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
ఇప్పటికే అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్....చంద్రబాబు ఇంటి దగ్గర చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. అటు నర్సీపట్నంలో అయ్యన్న ఇంటి దగ్గర వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ కూడా ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు. ఇక వీరే కాదు...మిగిలిన వైసీపీ నేతలు వరుసపెట్టి అయ్యన్నపై ఫైర్ అవుతున్నారు. అలాగే చంద్రబాబు, లోకేష్‌లని ఉద్దేశించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే...అయ్యన్న...జగన్‌ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని, ఆయన నాలుక కోస్తామని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
అయితే ఇంతవరకు అంతా బాగానే ఉంది...అయ్యన్న అనుచితంగా మాట్లాడారు కాబట్టి, ఆయనపై చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకోవచ్చు. అలా అని వైసీపీ నేతలు అసలు బూతులే మాట్లాడనట్లు చెబుతున్నారు. అధికారంలో ఉన్నాం కదా అని వైసీపీ నేతలు ఏది చెబితే అది జనం నమ్మే పరిస్తితిలో లేరు. ఎందుకంటే ఎన్నిసార్లు వైసీపీ నేతలు చంద్రబాబు, లోకేష్‌లని దూషించారో అందరికీ తెలిసిందే. ఇంతకంటే దారుణంగా తిట్టారు. మరి అలాంటప్పుడు తాము కూడా జగన్ ఇంటికెళ్ళి నిరసన తెలియజేయాలా? అని టి‌డి‌పి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఏదేమైనా రాజకీయాల్లో ఇలాంటి తరహా విమర్శలు సరికావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: