హుజురాబాద్ కే మ‌రో నామినేష‌న్ ప‌ద‌వి..?

Paloji Vinay
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చ‌నీయాంశ‌మైన విష‌యం హుజురాబాద్ ఉప ఎన్నిక‌లు. ఈట‌ల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక‌లు అనివార్య‌మ‌యిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల్లో త‌మ ప్ర‌భావాన్ని చూపి విజ‌య కేత‌నం ఎగుర వేయాల‌ని ఆయా పార్టీలు వ్యూహాలు ర‌చించాయి. దీంతో అధికార పార్టీ హుజురాబాద్ పై వ‌రాల జ‌ల్లు కురిపిస్తోంది. ద‌ళిత‌బంధు ను మొద‌ట‌గా ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమ‌లు చేస్తున్నారు. అలాగే నామినేట్ ప‌ద‌వుల్లో హుజురాబాద్ నేత‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చింది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఈ క్ర‌మంలో మ‌రో నామెనేటెడ్ ప‌ద‌వి హుజురాబాద్‌కు ద‌క్క‌నుంద‌ని స‌మాచారం.
   
    హుజురాబాద్ కు చెందిన బండా శ్రీ‌నివాస్‌కు ఎస్సీ కార్పోరేష‌న్ ప‌ద‌వి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అలాగే వ‌కులాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్ కు బీసీ క‌మిష‌న్ చైర్మెన్ ప‌ద‌వి ఇచ్చారు. ఇలాగే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన పాడి కౌశిక్ రెడ్డికి నామినేటెడ్ ఎమ్మెల్సీ ప‌ద‌వికి సిఫార‌స్ చేస్తూ  గ‌వ‌ర్న‌ర్ కు లేఖ కూడా పంపారు సీఎం కేసీఆర్. అలాగే బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కాంగ్రెస్ నాయ‌కులు స్వ‌ర్గం ర‌వితో పాటు హుజురాబాద్ కు చెందిన మ‌రో నేత‌కు నామినేటెడ్ ప‌ద‌వి ద‌క్క‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.


   గతంలో హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్మెన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన వడ్లూరి విజ‌య్ కుమార్ కు నామినేటెడ్ ప‌ద‌వి వ‌రించ‌నుంద‌ని తెలుస్తోంది. గురువారం రోజు హుజురాబాద్ విశ్వ‌క‌ర్మ విశ్వ‌బ్రాహ్మ‌ణ మ‌నుమ‌య‌ క‌మ్యూనిటీ హాల్ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్తాప‌న‌లో పాల్గొన్న మంత్రి హ‌రీష్ రావు మాట‌లు కూడా ఆ ప్ర‌చారానికి బ‌లం చేకూరుస్తోంది. వ‌డ్లూరి విజ‌య్ కుమార్ హుజురాబాద్ మున్సిపాలిటీ అభివృద్దికి చాలా క‌షి చేశార‌ని ఈట‌ల కుతంత్రాల‌కు విజ‌య్ కుమార్ ముందుగా బ‌ల‌య్యార‌ని చెప్పారు.


 ఆయ‌న‌కు స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌న్న హ‌రీష్‌రావు మాట‌ల వెనుక ఆంత‌ర్యం ఏమిట‌ని ఆలోచిస్తున్నారు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు. నిజానికి వ‌డ్లూరి విజ‌య్ కుమార్ హుజురాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధితో ప్ర‌జ‌ల గుండెల్లో స్తానం సంపాదించుకున్నారు. ఇప్పుడు హ‌రీష్‌రావు మాట‌ల‌తో విజ‌య్‌కి మ‌రో నామినేటెడ్ ప‌ద‌వి రానుంద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: