టీడీపీ తమ్ముళ్ళు టోటల్ చేంజ్... ?

Satya
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడాక రెండేళ్ల పాటు టీడీపీలో ఎలాంటి కార్యక్రమాలు లేవు. అయితే ఇటీవల కాలంలో మాత్రం టీడీపీ ఒక్కసారిగా గొంతు పెంచుతోంది. వైసీపీ మీద తమ్ముళ్ళు దాడి చేస్తున్నారు. మాటల జోరు బాగా పెంచుతున్నారు.
టీడీపీలో చాలా మంది నాయకులు ఉన్నారు. వారిలో ఈ రోజుకీ ఫైర్ బ్రాండ్ అనదగిన నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఆయన జగన్ మీద మాట్లాడాలి అంటే పూనకం వచ్చినట్లుగా రెచ్చిపోతారు. ఆయన ఇపుడు టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నారు. ఆయన తెల్లారి లేస్తే జగన్ మీద విమర్శలు చేయకుండా ఉండరు.
తాజాగా గుంటూరులో జరిగిన మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ వర్ధంతి కర్యక్రమానికి హాజరైన అయ్యన్నపాత్రుడు ఒక రేంజిలో వైసీపీ సర్కార్ మీద రెచ్చిపోయారు. జగన్ ని కూడా అనరాని మాటలు అన్నారు. జగన్ ని పట్టుకుని ఏకవచన ప్రయోగమే చేశారు. మరి ఎందుకు ఇలా ఈ సీనియర్ నేత ఇలా మాటలను వాడుతున్నారు అన్నదే చర్చగా ఉంది.
టీడీపీలో ఈ మధ్య కాలంలో భాష మారుతోంది.  ఇటీవల కర్నూల్ టూర్ లో లోకేష్ అయితే ఏక వచన ప్రయోగంతోనే జగన్ని సవాల్ చేశారు. ఇక మరికొందరు నేతలు అయితే జగన్ని పట్టుకుని ఘాటైన విమర్శలే చేస్తూ వచ్చారు. ఇక ఏపీలో తుగ్లక్ పాలన సాగుతోంది అంటూ తమ్ముళ్ళు తరచూ అంటున్న సంగతి తెలిసిందే. అంటే టీడీపీ తన రూటు మార్చింది అనుకోవాలి. భాష విషయంలో కూడా గతంలోలా కొలమానాలు ప్రమాణాలు అన్నీ పక్కన పెట్టేసింది అనుకోవాలి. అగ్రెస్సివ్ మూడ్ లో ఉన్నట్లుగా జనాలకు చెప్పాలన్న తాపత్రయంతో టీడీపీ భాషను మార్చింది అంటున్నారు.
దీని వల్ల జనాల్లో వేడి పుట్టి వైసీపీ సర్కార్ మీద వ్యతిరేకత తీవ్రంగా వస్తుంది అని ఆ పార్టీ ఆలోచన అయి ఉండవచ్చు. కానీ ఇలాంటి భాషను ఉపయోగించడం వల్ల బూమరాంగ్ అయిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ నాటి సీఎం చంద్రబాబు మీద వాడిన భాష వల్లనే ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడింది అని చెబుతారు. పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి భాష నాడు  వాడారు. తరువాత ఆయన కూడా ఓడారు, ఇపుడు టీడీపీ ఈ భాషను అందిపుచ్చుకుంటోంది. కానీ జనాలు అన్నీ గమనిస్తారు. తప్పుంటే వారే సర్కార్ విధానాలను వ్యతిరేకిస్తారు. కానీ ఏదీ కూడా హద్దులు దాటరాదు, కానీ టీడీపీ తమ్ముళ్ళ తీరు చూస్తే నోరు జోరు చేయాలన్న ఆరాటం కనిపిస్తోంది. చూడాలి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: