టీకా తీసుకుంటేనే జీతం, బోన‌స్.. ఎక్క‌డంటే ?

Paloji Vinay
భార‌త ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై ప్ర‌జ‌ల‌కు విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది. కోవిడ్ టీకా వ‌ల్ల క‌లిగే మేలును గురించి వివ‌రిస్తోంది. అదే క్ర‌మంలో దేశ‌ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగంగా కొన‌సాగిస్తోంది. రోజుకు ల‌క్ష‌ల్లో డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తోంది. ఇంత విస్తృతంగా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌చారం చేస్తున్న కొంద‌రు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.

 
  పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా తమిళి సై సౌందరరాజన్ అద‌న‌పు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఆమె పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే కొవిడ్ టీకా  ఆవశ్యకతను వివరిస్తూ, అందరూ క‌రోనా వ్యాక్సిన్‌ వేసుకోవాలన్న నినాదంతో పుదుచ్చేరిలో వైమానిక దళానికి చెందిన సైనికులు చేపట్టిన ర్యాలీని  జెండా ఊపి ప్రారంభించారు తమిళి సై సౌందరరాజన్‌.

   అనంతరం త‌మిళి సై మాట్లాడుతూ.. కొవిడ్ వ్యాక్సిన్  తీసుకుంటేనే జీతం, దీపావళి బోన‌స్‌, ఇత‌ర రాయితీలు ఇస్తామని తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకుంటే కరోనా మ‌హ‌మ్మారి నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు.  రెండు డోసుల టీకా తీసుకున్నవారు కొవిడ్ భారిన ప‌డ్డా వెంటనే కోలుకుంటున్నారని చెప్పారు. కుటుంబాన్ని, చుట్టూ ఉన్నవారిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు ఆమె.


   మ‌రోవైపు పుదుచ్చెరిలో గురువారం రోజు కొత్త‌గా 107 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో ఇద్ద‌రు క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇప్ప‌టివ‌ర‌కు 963 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే పుదుచ్చెరిలో క‌రోనా భారిన ప‌డి 1,827 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాంతాల వారిగా మ‌ర‌ణాల సంఖ్య‌ను చూస్తే టోల్ పుదుచ్చెరి -  1,437,  కారైకల్ - 242, యానం - 106 మాహే - 42 క‌రోనా తో చ‌నిపోయారు. అలాగే రిక‌వ‌రి రేటు ఎక్క‌వ‌గా 97 శాతానికి పైగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా దాదాపు స‌గానికి పైగా ప్ర‌జ‌ల‌కు కొవిడ్ మొద‌టి డోస్ పంపిణీ చేసిన‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: