చంద్రబాబు ఇంటిపై దాడి... ఒక్క పిలుపు ఇస్తే...?

Sahithya
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడిని టీడీపీ నేత, మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో లేదో అర్ధం కావడం లేదు అని అన్నారు ఆయన. ఎమ్మెల్యే జోగి రమేష్ వైసీపీ గుండాలను తీసుకుని చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లడం ఏంటి ? అని ఈ సందర్భంగా నిలదీశారు. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటే వారిపై వైసీపీ గుండాలు విచక్షణారహితంగా దాడి చేశారు అని ఆరోపణలు చేసారు.
ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి జగన్ ఇటువంటి నాటకాలు ఆడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో 10 లక్షల పెన్షన్లు తొలగించి మీడియా, ప్రజల దృష్టిని మళ్లించేందుకే దిగజారుడు రాజకీయం చేస్తున్నారు అని విమర్శలు చేసారు. చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి వస్తే పోలీసులు వత్తాసు పలుకుతున్నారు అని ఆయన విమర్శించారు. డిజిపికి తెలియకుండానే జోగి రమేష్ చంద్రబాబు నివాసానికి వచ్చారా ? అని విమర్శించారు. చంద్రబాబు ఇంటి ముట్టడికి వచ్చిన జోగి రమేష్ ను అరెస్ట్ చేయకుండా టీడీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేయడం ఏంటి ? అని నిలదీశారు.
వైసీపీ మంత్రులు అసెంబ్లీలో బూతులు తిడితే ముఖ్యమంత్రి జగన్ ప్రోత్సహిస్తున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు ఒక్క పిలుపునిస్తే వైసీపీ నాయకులు రాష్ట్రం వదిలిపారిపోయేలా ప్రజలే చేస్తారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే జోగి రమేష్ పెడన నియోజకవర్గంలో ఎంత దోచుకున్నాడో ప్రజలే చెబుతారు అన్నారు రవీంద్ర. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు అని హెచ్చరించారు. కాగా చంద్రబాబు ఇంటి ముట్టడి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో వివాదాస్పదంగా మారింది. టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: