పాలకవర్గంలో పారిశ్రామిక వేత్తలదే పైచేయి!

N.Hari
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల సంఖ్యను మరోసారి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై పలు రకాలుగా చర్చ జరుగుతోంది. శ్రీవారి సన్నిధిలో పారిశ్రామిక వేత్తలు, కేసులు ఉన్న నేతలు, పాలకమండలిలో చేరిపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఆహ్వానితుల్లో ఉన్న కొంతమంది నేతలు, పారిశ్రామికవేత్తలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పాలక మండలి 25మందిలో పది మంది పారిశ్రామిక వేత్తలే ఉన్నారు. ఇందులో జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడైన ఇండియా సిమెంట్స్‌కు చెందిన శ్రీనివాసన్‌ ఉన్నారు. ఆయన గత పాలక మండలిలో కూడా సభ్యునిగా వ్యవహరించారు. ఇక తెలంగాణాలో మై హోమ్‌ గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వరరావు, హెటిరో గ్రూపు అధినేత పార్ధసారథి రెడ్డి, ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్ ఫార్మా కంపెనీ అధినేత మన్నే జీవన్‌రెడ్డి, పాలక మండలిలో చేరిపోయారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మన్నే జీవన్‌రెడ్డి సన్నిహితుడు కావడం గమనార్హం.
సాహితీ గ్రూపు ఛైర్మన్, రియల్ ఎస్టేట్ అధిపతి అయిన భూధాటి లక్ష్మీనారాయణను కూడా పాలక మండలి సభ్యునిగా నియమించారు. ఇక ముంబయికి చెందిన క్యాపరీ గ్లోబల్ అధినేత రాజేష్ శర్మ, కోల్‌కతాకు చెందిన పారిశ్రామిక వేత్త సౌరభ్‌లకు కూడా పాలకమండలిలో స్థానం దక్కింది. గత పాలక మండలిలో సభ్యురాలిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బంధువులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కూడా మళ్లీ పాలక మండలిలో స్థానం లభించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కేతన్ దేశాయ్‌కు పదవి లభించింది. మెడికల్ కౌన్సిల్ వివాదంలో ఈయనపై కేసులు ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు జనసేన నుంచి వైసీపీలోకి వచ్చిన రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు సతీమణి అల్లూరి మల్లీశ్వరికి, పాండిచ్చేరికి  చెందిన ఎమ్మెల్యే జగన్ సన్నిహితుడు అయిన మల్లాది కృష్ణారావుకు పదవులు దక్కాయి. ఇక కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప మనువడు శశిధర్‌కు, కూడా పదవులు దక్కాయి.
తమిళనాడుకు చెందిన కన్నయ్య పై పలు కేసులు ఉన్నప్పటికీ ఆయనను ప్రత్యేక ఆహ్వానితునిగా పాలక మండలిలో నియమించారు. వీరు కాకుండా రాజకీయాలలో వివాదాల్లో చిక్కుకున్న అనేక మంది పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే పాలక మండలి నియామకంపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఆధ్యాత్మిక సంస్థలు కూడా పాలక మండలిలో పారిశ్రామిక వేత్తలు, అనేక కేసులు ఉన్నవారిని నియమించడం ఏమిటన్న ఆందోళన శ్రీవారి భక్తుల్లో వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: