టీడీపీని రాజ‌శేఖ‌ర్ రెడ్డి గ‌ట్టెక్కిస్తారా ?

VUYYURU SUBHASH
కర్నూలు జిల్లా అంటేనే వైసీపీకి కంచుకోటగా ఉన్న విషయం తెలిసిందే. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వైసీపీ హవా ఉంటుంది. 2014 ఎన్నికలు కావొచ్చు, 2019 ఎన్నికలు కావొచ్చు జిల్లాలో వైసీపీ హవా స్పష్టంగా కొనసాగుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. దీంతో జిల్లాపై వైసీపీకి పూర్తిగా పట్టు దొరికింది. అయితే ఎన్నికలై రెండేళ్ళు దాటేసింది. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో టి‌డి‌పి నేతలు కూడా యాక్టివ్‌గా పనిచేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో వైసీపీపై కాస్త వ్యతిరేకత వస్తున్నట్లు కనబడుతోంది.  ఇప్పుడుప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో టి‌డి‌పి పికప్ అవుతుంది.
టి‌డి‌పి నాయకులు యాక్టివ్‌గా పనిచేయడం మొదలుపెట్టారు. పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా బాగానే యాక్టివ్ అయ్యారు. పార్టీ తరుపున ప్రజల సమస్యలపై పోరాటం చేయడం మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి బుడ్డా సైలెంట్ అయిపోయారు. అసలు గత ఎన్నికల్లోనే పోటీ చేయకూడదని బుడ్డా భావించారు. కానీ చంద్రబాబు సపోర్ట్ ఇవ్వడంతో బుడ్డా ఎన్నికల బరిలో దిగారు.
ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి శిల్పా చక్రపాణి రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దాదాపు 38 వేల ఓట్ల మెజారిటీ తేడాతో బుడ్డా ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి పార్టీలో కనిపించడం తగ్గించారు. కానీ ఈ మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో బుడ్డా కూడా ఫీల్డ్‌లోకి దిగారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలాగే వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతున్నారు.
ఇలా బుడ్డా దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. అయితే శ్రీశైలంలో వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మ‌రో వైపు త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గంలో మార్పులు, చేర్పులు జ‌ర‌గ‌నున్నాయి. శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్నారు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తే బుడ్డా మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. అంటే టి‌డి‌పి ఇంకా స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరముంది. వచ్చే ఎన్నికల్లోపు బుడ్డా ఇంకా దూకుడు పెంచితేనే శిల్పాకు పోటీ ఇవ్వగలరు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: