అమిత్‌ షా ఆ క్లారిటీ ఇస్తారా?

N.Hari
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న భారతీయ జనతా పార్టీ.. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటానికి ఇష్టపడటం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేసీఆర్ నియంతృత్వ, అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ అధ్యక్షుడు బండి‌ సంజయ్ ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయించడంతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలను తెలంగాణ సమాజానికి వివరిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చాలా కాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్‌ చేస్తూ వస్తోంది. దీంతో విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఒక అవకాశంగా భావిస్తోంది. విమోచన దినోత్సవం వేళ నిర్మల్‌లో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఇవాళ మధ్యాహ్నం జరగనున్న సభకు బీజేపీ అగ్రనేత అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. దీంతో కమలనాథులు అమిత్ షా సభను సీరియస్‌గా తీసుకున్నారు. మజ్లిస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించటం లేదన్న విషయాన్ని సమాజానికి వివరించాలని బీజేపీ నిర్ణయించింది.
నిర్మల్ సభలో అమిత్ షా ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. తాజాగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కేసీఆర్‌ ఢిల్లీలో వారం రోజులకుపైగా మకాం వేసి వరుసగా పలువురు కేంద్ర మంత్రులను కలవడం వంటి పరిణామాలతో రాష్ట్ర బీజేపీ వర్గాల్లోనే అనుమానాలు రేకెత్తాయి. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టింది. బండి సంజయ్ పాదయాత్ర చేసినా ఉపయోగం లేదని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శిస్తున్నారు.  బండి సంజయ్ పాదయాత్రకు మంచి స్పందన వస్తున్న  సమయంలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, అమిత్‌షాలను కలిశారు. తెలంగాణ బీజేపీ నేతలు ఎన్ని మాట్లాడినా.. ఢిల్లీ స్థాయిలో బీజేపీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్న సంకేతాలను కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీలు ఒకే తాను ముక్కలన్న ప్రచారం రాష్ట్రంలో జోరందుకుంది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. అందుకే అమిత్ షా నిర్మల్ సభ ద్వారా టీఆర్ఎస్‌తో సంబంధాలపై క్లారిటీ ఇస్తారని కమలనాథులు భావిస్తున్నారు. నిర్మల్ సభకు మొత్తం లక్ష మంది వస్తారని బీజేపీ అంచనా వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: