ముంబైని పట్టి పీడిస్తున్న మరో వైరస్..!

Podili Ravindranath
ముంబై మహా నగరానికి వైరస్ బాధలు ఇప్పట్లో వదిలేలా లేవు. గతంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదులో రికార్డు సృష్టించిన ముంబై సిటీ... ఇప్పుడు మరో వైరస్‌తో పోరాడుతోంది. వర్షాకాలంలో దేశవ్యాప్తంగా డేంజర్ బెల్స్‌ మోగిస్తున్న డెంగీ వైరస్‌... ముంబై వాసులను పట్టిపీడిస్తోంది. ఇప్పుడు మహారాష్ట్రలో అత్యధిక డెంగీ ఫీవర్ కేసులు ముంబై సిటీలోనే నమోదవుతున్నాయి. డెంగీ రోజులకో ముంబై ఆసుపత్రులు నిండిపోతున్నాయి. సగటున రోజుకు వందకు పైగా డెంగీ కేసులు నమోదవుతుండటంతో... అధికారులు అప్రమత్తమయ్యారు.
కేవలం 3 రోజుల్లోనే ముంబై సిటీలో ఏకంగా 500 మందికి డెంగీ వైరస్ సోకింది. ఆగస్టు నెల మొత్తం మీద 250 కేసులు నమోదు కాగా... ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఇప్పటి వరకు ఏకంగా వెయ్యి మందిపైగా డెంగీ భారిన పడ్డారు. ఈ ఏడాది ఇప్పటికే డెంగీ కారణంగా పది మంది వరకు మరణించినట్లు బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. డెంగీ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అత్యవసర చర్యలు చేపట్టాలని ముంబై కార్పొరేషన్ అధికారులను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. డెంగీ వైరస్ వ్యాప్తిపై అత్యవసర సమావేశం నిర్వహించారు ఠాక్రే. ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన ముంబై క్రిమి నియంత్రణ విభాగం... నగరంలో దాదాపు నాలుగున్నర లక్షల ఇళ్లను తనిఖీ చేసింది. దోమలు బాగా వ్యాపించే 5 వేల ప్రదేశాలను గుర్తించిన అధికారులు... వాటిని నాశనం చేసినట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత పాటించాలని... ఇళ్లల్లో దోమలు వ్యాపించకుండా తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తడి చెత్త, పొడి చెత్తను తప్పనిసరిగా వేరు చేయాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. టిన్‌లు, థర్మోకోల్‌ పెట్టెలు, కొబ్బరి చిప్పలు, టైర్లు, పాత వస్తువుల్లాంటివి ఇళ్లల్లో ఉంచరాదని ఆదేశించారు. నగరంలో దోమలు పెరిగే ప్రాంతాలను నాశనం చేసేందుకు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: