బాబు...కల్యాణ్ బాబుని కలుపుకోవాల్సిందే...ఆ తమ్ముళ్ళు ఫిక్స్?

M N Amaleswara rao
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో పొత్తు ఉంటేనే...వైసీపీని ధీటుగా ఎదురుకోగలమని కొందరు తెలుగు తమ్ముళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సపోర్ట్ ఇవ్వడం వల్లే, ఓడిపోవాల్సిన సీట్లు కూడా గెలుచుకోగలిగామని నమ్ముతున్నారు. అలాగే గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి చాలా సీట్లలో ఓడిపోవాల్సి వచ్చిందని అంటున్నారు.
అయితే ఈ సారి జనసేనకు మంచిగా ఓటింగ్ ఉన్న నియోజకవర్గాల్లో టి‌డి‌పి గెలవాలంటే పవన్ కల్యాణ్ మద్ధతు ఉండాల్సిందే అని కొందరు తమ్ముళ్ళు భావిస్తున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో చాలామంది నాయకులు అదే భావనలో ఉన్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి కేవలం నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకుంది. అలాగే వైసీపీ 14 సీట్లు గెలుచుకుంటే, జనసేన ఒక సీటు గెలుచుకుంది.
ఒకవేళ ఇక్కడ టి‌డి‌పి, జనసేనలు కలిసి పోటీ చేసి ఉంటే కనీసం 10 సీట్లు అయిన గెలుచుకునేవి అని తమ్ముళ్ళు భావిస్తున్నారు. అటు జనసేన కార్యకర్తలు కూడా అదే భావనలో ఉన్నట్లు కనబడుతోంది. తమకు కొన్ని సీట్లు వచ్చేవని వారు భావిస్తున్నారు. ఎందుకంటే తూర్పులో ఉన్న నియోజకవర్గాల్లో జనసేనకు ఓట్లు గట్టిగానే పడ్డాయి. ముఖ్యంగా వైసీపీ గెలిచిన స్థానాల్లో జనసేనకు ఓట్లు బాగా వచ్చాయి. అంటే వైసీపీకి టి‌డి‌పి మీద వచ్చిన మెజారిటీల కంటే...జనసేనకు పడిన ఓట్లే ఎక్కువ. ఒకవేళ రెండు పార్టీలు కలిసి ఉంటే ఆ స్థానాల్లో వైసీపీకి చుక్కలు కనిపించేవి.
అయితే ఈ సారి పవన్‌తో కలిస్తేనే వైసీపీని ఢీకొట్టగలమని, అలా కాకుండా ఒంటరిగా బరిలో దిగితే మళ్ళీ ఓట్లు చీలిపోటీ వైసీపీకే బెనిఫిట్ అవుతుందని, అంటే టి‌డి‌పి, జనసేనలు పరోక్షంగా నష్టపోవాల్సిందే అని తెలుస్తోంది. అందుకే కొందరు తమ్ముళ్ళు పవన్‌ని కలుపుకుని పోవాలని చంద్రబాబుకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తు విషయంలో బాబు కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. మరి చూడాలి ఈ సారి టి‌డి‌పి-జనసేనల పొత్తు పొడుస్తుందేమో.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: