ఓవ‌ర్ టు మోడీ : పెద్ద‌న్న రాజ్యానికి పెద్దాయ‌న !

RATNA KISHORE

ప్ర‌పంచానికి చేసిన మేలు మీడియా మ‌రిచిపోయినా, మోడీ మ‌రిచిపోకూడ‌దు అన్న సంప్ర‌దాయంలో భాగంగా క్వాడ్ కూట‌మిలో నూ త‌రువాత ఐరాస‌లోనూ మోడీ అత్యంత భావోద్వేగంతో చేయ‌బోయే లేదా  చెప్ప‌బోయే మాట‌లు అతి త్వ‌ర‌లో మ‌నం వినగ లం. ఎందుకంటే వ‌చ్చే శుక్ర‌వారం (సెప్టెంబ‌ర్ 24) ఇందుకు ముహూర్తం అయి ఉంటుంది. అదే తేలిపోయింది కూడా!అమెరికా భార‌త్ సంబంధాల‌తో పాటు మ‌రికొన్ని ప‌నులు చ‌క్క‌దిద్దేందుకు మోడీ త్వ‌ర‌లో అటుగా పోతున్నారు. ఈ ప్ర‌యాణంలో ఆస్ట్రేలియా, జపాన్ దేశ ప్ర‌ధానులనూ క‌ల‌వ‌డం, ఇంకొన్ని విష‌యాలు మాట్లాడ‌డం జ‌ర‌గ‌నున్న ప‌రిణామం. ఇవ‌న్నీ ఎలా ఉన్నా తాలిబాన్ల ప్ర‌మాదంపై అమెరికా, భార‌త్ చ‌ర్చించేందుకు అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. పాక్ దేశం ఇప్ప‌టికే తాలిబాన్ల‌ను త‌మ‌కు అనుగుణంగా మ‌లుచుకుని క‌శ్మీరు పై కాలు దువ్వేందుకు ప్ర‌య‌త్నిస్తున్నందున వీటిపై కూడా మాట్లాడాలి అని ఆయ‌న అనుకోవ‌డం ఓ విధంగా మంచి ప‌రిణామం. ఇక భార‌త్ - అమెరికా ఆర్థిక సంబంధాలు అన్నవి ఈ ప‌ర్య‌ట‌న‌లో చ‌ర్చ‌కు వ‌స్తాయా లేదా అన్న‌ది కూడా ఆస‌క్తిదాయ‌కం.
క‌రోనా నియంత్ర‌ణ‌కు భారత్ వ్యాక్సీన్లు ఇచ్చి ప్ర‌పంచానికి చేసిన సాయం మ‌రువ వ‌ద్దు అని మోడీ మ‌రో మారు చెప్ప‌నున్నార‌ని తెలుస్తోంది. క‌రోనా నియంత్ర‌ణ‌కు క‌లిసి పోరాడాల్సిన ఆవ‌శ్య‌క‌త‌పై దేశాలు ఏ విధం అయిన అంగీకారానికి వ‌స్తాయో అన్న‌ది కూడా ఆస‌క్తిదాయకం. కాగా భార‌త్, ఆస్ట్రేలియా, జ‌పాన్, అమెరికా ఈ నాలుగు దేశాలు క‌లిసి చైనాను నిలువ‌రించాల‌న్న ఆశ‌యంతో కూడా ఉన్నాయ‌ని అంత‌ర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ నాలుగు దేశాలు క‌లిపి ఏర్ప‌డిన క్వాడ్ కూట‌మి ఇంకేం చేస్తుంది..వాతావ‌ర‌ణ మార్పుల‌ను ఏ విధంగా అర్థం చేసుకుని వికృతాల‌ను ఎలా నిలువ‌రిస్తుంది అన్న‌ది కూడా ఇప్పుడిక కీల‌కం.
క‌రోనా కార‌ణంగా విదేశీ ప‌ర్య‌ట‌నలేవీ వ‌ద్ద‌ని నిర్ణ‌యించుకున్న మోడీ త్వ‌ర‌లోనే గ‌గ‌న వీధుల సంచారిగా మార‌బోతున్నారు. ఈ నెల 24న అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ ను క‌ల‌వ‌నున్నారు. ఆ రోజే క్వాడ్ స‌ద‌స్సుకు హాజ‌రు కానున్నారు. త‌రువాత ఐక్య రాజ్య స‌మితి లో ప్ర‌స‌గించ‌నున్నారు. చాలా రోజుల‌కు మోడీ ప‌ర్య‌ట‌న ఖ‌రారు కావ‌డం,  బైడెన్ అమెరికా అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేశాక తొలిసారి ఆయ‌న‌ను క‌ల‌వ‌డం ఇవ‌న్నీ ఈ యాత్ర‌కు సంబంధించిన ప్ర‌త్యేకత‌లు. ఇక ఈ యాత్ర‌లో ఆయ‌న వాతావ‌ర‌ణ మార్పుల‌పై మాట్లాడ‌నున్నారు. అలానే ఇంకొన్ని సాంకేతిక అంశాల‌పై ఆయ‌న చ‌ర్చించ‌నున్నారు అని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: