అమెరికా చేసిన ఆ పనితో.. ఆ అప్ఘాన్ల గుండెళ్లో రైళ్లు..?
ఇక ఇప్పుడు.. అమెరికా పౌరులను మాత్రమే తరలించాలని వారు ఆదేశించారన్న వార్తలు వస్తున్నాయి. దీంతో ఇన్నాల్లూ అఫ్గానిస్తాన్‌లో అమెరికా సైన్యానికి సహాయకంగా పని చేసిన వేల మంది అఫ్గాన్ పౌరులు ప్రాణాలు అర చేత్తో పట్టుకుని దేశం విడిచివెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అమెరికా తన పౌరులను మాత్రమే విమానాశ్రయానికి పంపాలని చెప్పిందంటున్న తాలిబన్లు వారిని అడ్డుకుంటున్నారు.
ప్రస్తుతం విమానాశ్రయాన్ని తాలిబన్లు చుట్టు ముట్టారు. వరుస పేలుళ్ల నేపథ్యంలో భారీ రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. అఫ్గాన్ ప్రజలు రాకుండా అడ్డుకొనేందుకు ఏకంగా తాలిబన్లు అదనపు సిబ్బందిని మోహరించారు. విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో చెక్‌పోస్ట్‌ల సంఖ్యను భారీగా పెంచారు. అఫ్గాన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలతో తాలిబన్లు విమానాశ్రయం పరిసరాల్లో పహారా కాస్తున్నారు.
ఈ చర్యలతో ఇన్నాళ్లూ అమెరికాకు సహకరించిన అఫ్గాన్లు బెంబేలెత్తుతున్నారు. అమెరికా బలగాలకు ట్రాన్స్‌లేటర్‌గా పని చేసిన ఓ వ్యక్తిని తాలిబన్లు అడ్డుకున్నారు. మూడు చెక్ పోస్టులు దాటి వెళ్లినప్పటికీ.. నాలుగో చెక్‌పోస్ట్ వద్ద ఆయన్ను తాలిబన్లు అడ్డుకున్నారు. అమెరికా పాస్‌పోర్టులు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని అమెరికన్లు చెప్పినట్టు తాలిబన్లు ఆయనకు చెప్పారు. అఫ్గాన్ నుంచి తమను తరలించకపోతే.. తాలిబన్ల చేతిలో తమకు ముప్పు తప్పదని వారు ఆందోళన చెందుతున్నారు. మరి ఇన్నాళ్లూ తమకు సహకరించిన అఫ్గాన్ల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత పెద్దన్న అమెరికాకు లేదా..? తన పౌరుల రక్షణ వరకూ తాను చూసుకుంటే.. వారిని కాపాడేదెవరు..?