తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్..? ‍

Chakravarthi Kalyan
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు ఓ శుభవార్త. ఇన్నాళ్లూ ఉద్యోగ నియామకాలకు అడ్డుగా ఉన్న ఉద్యోగుల వర్గీకరణ పూర్తయింది. క్రమంగా నోటిఫికేషన్లకు అడ్డంకులు తొలగుతున్నాయి. కొత్త జోనల్ విధానం ప్రకారం.. జిల్లా, జోనల్‌, బహుళ జోన్‌ పోస్టుల గుర్తింపు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ఇన్నాళ్లూ ఈ వర్గీకరణ లేకనే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాలేదు. ఇప్పుడు ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలోనే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.

మొత్తం 87 శాఖల విభాగాల్లో ఉద్యోగుల వర్గీకరణ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వివిధ శాఖల్లోని పోస్టులను జిల్లా లోకల్‌, జోనల్‌, బహుళ జోన్‌ కేడర్‌ వారీగా గుర్తించారు. ఎక్కువ శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి వరకు జిల్లా కేడర్‌గా ఉన్నాయి. పలు శాఖల్లో సీనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్లు జోనల్‌, గ్రూపు-1 ఆ పైస్థాయి అధికారులు బహుళ జోన్లలో ఉన్నాయి. అయితే అన్నీ శాఖల్లోనూ ఒకే తరహాలో లేవు. ఆయా శాఖల పరిస్థితులను బట్టి కేడర్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం ఆయా శాఖలకు ఇచ్చింది.

మొత్తం 87 విభాగాధిపతుల పరిధిలో ఉద్యోగాల వర్గీకరణను ఖరారు చేస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో వేగం పెంచేందుకు కొత్త జోనల్‌ విధానం అమలుకు ముందే ప్రభుత్వం పోస్టుల వర్గీకరణకు పూనుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఆరు జోన్లు ఉండేవి. ఆరు జోన్లలో జిల్లా, జోన్‌, బహుళ జోన్‌, రాష్ట్ర కేడర్‌లు ఉండేవి.  తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతానికి రెండు జోన్లు మిగిలాయి. వాటితోనే నియామక ప్రక్రియ చేపట్టేవారు.

రాష్ట్ర విభజన తర్వాత కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా సంస్కరణలు చేపట్టారు. జిల్లా, జోన్‌, బహుళ జోన్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది కేసీఆర్ సర్కారు. గతంలో సచివాలయం, శాఖాధిపతుల పోస్టులు రాష్ట్రస్థాయి కేడర్‌గా ఉండేవి. ఇప్పుడు వాటిని కూడా జోనల్‌ విధానం కిందకు తెచ్చి అందరూ పోటీపడే అవకాశం తీసుకొచ్చారు. కొత్త జోన్ల విధానం ద్వారా బహుళ జోన్ల జాబితాలో రాష్ట్రస్థాయి పోస్టులుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: