విశాఖ ఉక్కుపై టీడీపీ స్టాండ్ ఏంటి ?

VAMSI
ఏపీలో టీడీపీ ప్రస్తుత పరిస్థితి గురించి తెలియంది కాదు. అధికారాన్ని ఒక యువకుడికి కోల్పోవడంతో చంద్రబాబు ఊరొదిలిపెట్టి హైద్రాబాద్ లో కూర్చొన్నారు. అప్పుడప్పుడు తెలుగు తమ్ముళ్లను వీడియో కాల్ మీటింగ్ ల ద్వారా ఉత్తేజపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పార్టీని మళ్ళీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుందాం, అసలు మన ఓటమికి బీజం పడింది ఎక్కడ అన్న విషయాలను పునరాలోచించుకుని పరిస్థితులను చక్కదిద్దుకుందామనే ఆలోచనే వదిలేసినట్టు ఉన్నారు. అలా కాదు అనుకుంటే, ప్రస్తుతం ఏపీలో ఉన్న సమస్యలపై అయినా బలంగా పోరాడుదామనే స్పిరిట్ కూడా లేనట్టు ఉంది. ఏదో తూతూమంత్రంగా అప్పుడప్పుడు జగన్ పై విమర్శలు, ప్రభుత్వం అలా చేస్తోంది ? ఇలా చేస్తోంది అని మాట్లాడడం చేస్తున్నారు. ప్రజలు నాయకులకు కనెక్ట్ కావాలంటే వారి సమస్యను మీ సమస్యగా తీసుకున్నప్పుడే వారు మిమ్మల్ని నమ్ముతారు.
అలా కాకుండా ప్రతీ సమస్యను మీ రాజకీయ స్వార్ధం కోసం ఉపయోగించుకుంటే వారు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరు. ఇదే విధంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నుండి కాపాడుకునే విషయంలో అసలు టీడీపీ ఏం చేస్తోంది ? ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీగా వారి స్టాండ్ ఏంటి ? అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు తెలియచేయడంలో విఫలమయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎప్పుడు సమస్య వచ్చినా, మా ఎంపీలు అంతా రాజీనామా చేస్తాం...మా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం అని ప్రకటించడమే కానీ, ఏనాడైనా రాజీనామా చేశారా ? చెయ్యరు...ఎందుకంటే చేసే ఆలోచన వారి మనస్సులో లేదు. ఈ విషయంలో మళ్ళీ ప్రజలకు చులకన అయ్యే అవకాశం ఉంది. రాజీనామాకు సిద్ధం అని అనడం కన్నా, ప్రజల కోసం మంచి జరగడానికి వారికి చెప్పి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వెంటనే రాజీనామా చేయండి, ఖచ్చితంగా ప్రజలు మీ వెంటే ఉంటారు. తద్వారా వైసీపీ ఎంపీలపై ఆ ఒత్తిడి పడుతుంది.
మీకున్నది ఇద్దరు ఎంపీలు మాత్రమే. కానీ వైసీపీకున్నది 23 మంది ఎంపీలు. ఒకవేళ వైసీపీ ఎంపీలు ఈ విషయంలో వెనక్కు తగ్గుదామనుకున్నా.. ప్రజల దృష్టిలో వ్యతిరేఖ భావన ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా టీడీపీ విశాఖ ఉక్కు విషయంలో సరైన స్టాండ్ తీసుకోవాలంటూ రాజకీయ విశ్లేషకులు పదే పదే అంటున్నారు. ఈ విషయంపై ఎంతో అపారమైన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఏ విడగా ముందుకు వెళ్తారన్నది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: