ఏపీ విద్యారంగంలో మరో సంచలనం.. ఏకంగా రూ.1800 కోట్లు..?

Chakravarthi Kalyan
వైఎస్‌ జగన్ సీఎం అయ్యాక.. ఏపీలో విద్యారంగంపై బాగా ఫోకస్ చేస్తున్నారు. నాడు నేడు వంటి కార్యక్రమాల ద్వారా విద్యారంగంలో సమూల మార్పులు తెస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ కార్పొరేట్ తరహా సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆ దిశగా మరో ముందడుగు పడింది. ఏపీలో విద్యారంగంలో ఖర్చు చేసేందుకు ఏకంగా 250 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే 1,860 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసేందుకు అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు ముందుకొచ్చింది.

ఈ నిధులతో ఆంధ్రప్రదేశ్ అభ్యసన పరివర్తన సహాయక పథకం అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. ఐదేళ్లు కాల పరిమితి కలిగిన ఈ పథకం ద్వారా ఐదేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా పునాది అభ్యసనాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయ-విద్యార్థుల పరస్పర సంబంధాలను, బోధనా నాణ్యతను మెరుగుపరచడం, సంస్థాగత సామర్థ్యాలను, సామాజిక సంస్థల ప్రమేయాన్ని బలోపేతం చేయడం ద్వారా నాణ్యమైన సేవలను అందించడం వంటి ముఖ్యమైన మూడు కీలక అంశాలపై దృష్టి సారిస్తారు.

ఈ ఆంధ్రప్రదేశ్ అభ్యసన పరివర్తన సహాయక పథకం అనేది ప్రపంచ బ్యాంకు ప్రత్యేక ప్రాజెక్టు. ఏపీలో గత పదేళ్లలో ఇలాంటి ప్రాజెక్టు అమలు జరగలేదంటోంది ప్రభుత్వం. ఫలితాలే లక్ష్యంగా అమలయ్యే ఈ ప్రాజెక్టును నిర్వహణ సామర్థ్యం కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ప్రపంచ బ్యాంకు ఇస్తుందని చెబుతోంది. ఇలాంటి ప్రాజెక్టు మన రాష్ట్రానికి రావడం గర్వకారణం అంటోంది.

ఇక ఈ ప్రాజెక్టు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో అమలు జరుగుతుంది. ఇందుకోసం అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన సలహా సంస్థల నుంచి కన్సల్టెంట్లను ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలో ఈ పథకం పర్యవేక్షణ కోసం ఒక ఐఏఎస్ అధికారి, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తారు. కడప జిల్లాలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లల కోసం ఏర్పాటయిన వైఎస్సార్‌ విజేత స్కూల్ తరహాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: