రుణమాఫీ వద్దు.. బాబు మమ్మల్ని వదిలేస్తే చాలంటున్నారు!
డ్వాక్రా రుణమాఫీ వద్దు... మా బ్యాంకు రుణాలను మాఫీ చేయనే వద్దు.. మమ్మల్ని ఇలా వదిలేస్తే చాలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరే ఏకైక కోరిక ఇదే.. రాజధాని ఎక్కడైనా పోయి కట్టుకోండి. మా భూములు మాకే మిగలనీయండి.. అంతకు మించి మేము మిమ్మల్ని కోరేది ఏమీ లేదు..అని అంటున్నారు రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతులు. .
రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతులకు ఇప్పటికిప్పుడు అన్ని రుణాలనూ రద్దు చేసేస్తాం అని వారు డ్వాక్రా రుణాలను కానీ, రైతులు బ్యాంకుల నుంచి తెచ్చుకొన్న రుణాలను కానీ కట్టాల్సిన అవసరం లేదని... అన్నీ తక్షణమే ప్రభుత్వం చెల్లించేస్తుందని.. వారంతా రుణ విముక్తులు అవుతారని ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రైతులు భిన్నంగా స్పందించారు. మాకు ఎలాంటి మాఫీ వద్దు.. అని వారు అంటున్నారు. భూములను లాక్కోవడానికి ప్రభుత్వం ఇలాంటి ఎత్తులు వేస్తోందని.. అయితే మాఫీ పేరుతో తమను మభ్యపెట్టవద్దని వారు వ్యాఖ్యానిస్తున్నారు. తమను ఇలా వదిలేస్తే చాలని అంటున్నారు
ఇలా ఉంది రైతుల వాదన. అయితే ప్రభుత్వం మాత్రం రాజధాని వ్యవహారంలో ఎక్కడా వెనక్కు వెళ్లడం లేదు. ఏదో విధంగా భూములను స్వాధీనం చేసుకోవడానికే సిద్ధం అయ్యింది. ఇప్పటికే వచ్చే సీజన్ నుంచి పంటల సాగే చేయకూడదని సీఆర్ డీఏ వాళ్లు ఆదేశించారు. ఈ విషయంలో రైతులు నోరు కొట్టుకొంటున్నా.. వినే నాథుడు ఎవడూ లేడు. మరి అంతిమంగా ఈ వ్యవహారం ఎంత వరకూ వెళుతుందో!