మందుబాబులకు శుభవార్త.. త్వరలో ఆ బ్రాండ్ల రేట్లు తగ్గుదల..!

N.ANJI
కేంద్ర ప్రభుత్వం మందుబాబులకు త్వరలో శుభవార్తను వినిపించబోతోంది. వైన్స్‌పై, యూరప్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వైన్ బాటిళ్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించనున్నట్లు కేంద్రం భావిస్తోంది. దీంతో విదేశాలకు చెందిన చాలా బ్రాండ్స్ ప్రస్తుతం ఉన్న ధర కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.
కేంద్ర ఆహార ఉత్పత్తుల తయారీ, ఆల్కహాలిక్ బేవరేజ్ మ్యాన్యూఫాక్చరర్స్ అధికారులు ఇటీవల సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని భావించింది. ఇందులో యూరప్ నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్ బ్రాండ్లపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించేందుకు నిర్ణయించింది.
విదేశీ మద్యం బాటిళ్లపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 150 శాతం కస్టమ్స్ డ్యూటీని విధిస్తోంది. ఈయూ-ఇండో వాణిజ్య ఒప్పందంలో భాగంగా కస్టమ్స్ డ్యూటీని 75 శాతానికి తగ్గించినట్లు కేంద్రం తెలిపింది. దీంతో విదేశీ మద్యం బ్రాండ్లు ఇప్పుడున్న ధర కంటే తక్కువగా దొరికే అవకాశాలు ఉన్నాయి. అయితే విదేశీ ఆల్కహాల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించినట్లయితే దేశీయ ఆల్కహాల్ ఉత్పత్తి సంస్థలపై ప్రభావం చూపనుంది. ఈ మేరకు కాన్ఫడెరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ కంపెనీస్ (సీఐఏబీసీ) డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి మాట్లాడుతూ.. ‘‘భారత్‌తో పోల్చుకుంటే యూరప్ దేశాల్లో ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీకి అయ్యే ఖర్చు 50 శాతానికి తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కస్టమ్స్ సుంకం పరిమితికి మించి తగ్గిస్తే దేశీయ ఆల్కహాల్ సంస్థలకు ఇబ్బందులు ఎదురవుతాయి.’’ అని పేర్కొన్నారు.
యూరప్ నుంచి భారత దేశానికి సంవత్సరానికి రూ.1850 కోట్ల మద్యం బాటిళ్లు దిగుమతి అవుతున్నాయని సీఐఏబీసీ వెల్లడించింది. ఇందులో కేవలం రూ.160 కోట్ల వైన్‌ను భారత్ యూరప్‌కు ఎగుమతి చేస్తోంది. దేశీయ ఆల్కహాల్ ఉత్పత్తుల వార్షిక టర్నోవర్ రూ.4.5 లక్షల కోట్లు ఉండగా.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల ద్వారా ఏడాదికి రూ.2.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతోందని సీఐఏబీసీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: