వైరల్ న్యూస్: ఆరు కాళ్ల దూడ పుట్టింది.. ఎక్కడో తెలుసా..!?

N.ANJI
ప్రప్రంచంలో రోజు ఎక్కడో చోట అనేక వింతలు విడ్డూరాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. 2020 నుంచి ఎప్పుడు చూడని వింత వింత సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.  దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.  కలియుగం అంతం కాబోతుందంటూ భయపడుతున్నారు. రాబోయే రోజులు మరింత గడ్డుగా మారబోతున్నాయని, దానికి ఈ సంఘటనలే నిదర్శనమని చెప్పుకుంటున్నారు.
రెండు తలలు పాములు, మనిషి ఆకారంలో పంది పిల్లల జననం.. ఇలా అనేక వింత జంతువులు పుడుతూనే ఉన్నాయి. ఇక ఇలాంటి వింతతో కూడిన జంతువులు పుడితే. స్థానికంగా ప్రజలు వాటిని చూడడానికి పరుగులు తీస్తూనే ఉంటారు.  అయితే, ఇలాంటి వింత సంఘటన ఒకటి తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పిఠాపురం మండలం, రామపర్తి గ్రామానికి చెందిన సూరారెడ్డి అనే రైతుకు గేదెలున్నాయి. అందులోని ఓ గేద నిన్న రాత్రి ఈనింది. గేదె ఈనిందని ఆనందంలో ఉన్న సూరారెడ్డి.. దూడను చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే దూడకు ఆరుకాళ్లున్నాయి. సాధారణంగా గేదెలకు నాలుగు కాళ్లే ఉంటాయి. దీనికి ఆరు కాళ్లు ఉండటం చూసి ఆశ్యర్యపోవడంతో సూరారెడ్డి వంతైంది.
అయితే ముందున్న రెండు కాళ్ల మధ్యలో ఓ కాలు, వెనుకున్న రెండుకాళ్ల మధ్యలో మరో కాలు అదనంగా ఉన్నాయి. విషయం ఆ నోటా ఈనోటా ఊరంతా తెలియడంతో ఆ వింత దూడను చూసేందుకు జనం పరుగులు పెడుతున్నారు. రైతు ఇచ్చిన సమాచారంతో దూడను పరిశీలించిన పశుసంవర్ధక శాఖ అధికారులు జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి దూడలు జన్మిస్తాయని.. ఇందులో వింతేం లేదని చెప్తున్నారు. ఇలా జన్మించిన దూడలు త్వరగా చనిపోయే అవకాశముందన్నారు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయని అభిప్రాయపడ్డారు.
ఇక పశువైద్యులు జన్యు లోపమని చెప్పినా స్థానికులు మాత్రం అది వింత దూడేనంటున్నారు. కొంతమంది ఓ అడుగు ముందుకేసి కలియుగం, కాకరకాయ అంటూ కబుర్లు కూడా చెప్తున్నారట. మొత్తానికి ఎక్స్ ట్రా కాళ్లేసుకొని భూమ్మీదకు వచ్చిన ఆ బుల్లి దూడ ఓ రోజంతా జనాల్ని పరుగులు పెట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: