జగడ్డ: నిమ్మగడ్డను చూస్తుంటే.. రేసుగుర్రం బ్రహ్మీ గుర్తొస్తున్నాడుగా..?

Chakravarthi Kalyan
నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. నిన్నటి మొన్నటి వరకూ అంతగా పరిచయం లేని ఈ పేరు ఇప్పుడు ఏపీ మారుమూల ప్రాంతాల్లోనూ మారుమోగుతోంది. అవును మరి.. ఏపీకి జగన్ సీఎం అయితే కావచ్చు కానీ..ఇప్పుడు ఏపీ ఎన్నికలకు సంబంధించినంత వరకూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సుప్రీం.. ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకే ఎడాపెడా అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. ఏమాత్రం మొహమాటం లేకుండా చెడుగుడు ఆడేస్తున్నారు.
ఇప్పుడు నిమ్మగడ్డను చూస్తే రేసు గుర్రం సినిమాలో బ్రహ్మానందం పోషించిన కిల్ బిల్ పాండే పాత్ర గుర్తొస్తుంది. ఆ సినిమాలో ఓ సాధారణ పోలీసుకు అసాధారణ అధికారాలు ఇస్తారు.. అంతే తాను సత్తా చూపిస్తాడు.. అడ్డొచ్చిన వాడినల్లా కాల్చిపారేస్తాడు.. ఇప్పుడు నిమ్మగడ్డ కూడా అలాగే కనిపిస్తున్నాడు.  అంతే కాదు.. తాను ఎవరికీ భయపడేది లేదని తేల్చి చెబుతున్నారు.
తాజాగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ప్రెస్ మీట్లో అదే విషయం చెప్పారు నిమ్మగడ్డ. ప్రతి వ్యవస్థకు రాజ్యాంగం నిర్దిష్టమైన విధులు కేటాయించిందన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌.. 40 ఏళ్ల నా సర్వీసులో ఎప్పుడూ వివాదాస్పదం కాలేదన్నారు. నా పరిధి, బాధ్యత నాకు తెలుసు.. స్వీయ నియంత్రణ పాటిస్తానంటున్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబాటు కుదరదన్న నిమ్మగడ్డ.. బాధ్యతలు నిర్వహించేందుకే అధికారాలు ఇచ్చారని గుర్తు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్న నిమ్మగడ్డ.. శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగులకు పనిభారం ఎక్కువన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతిభావంతులైన అధికారులు ఉన్నారని కామెంట్ చేశారు ఎస్‌ఈసీ. తన విధుల్లో జోక్యం చేసుకున్నారు కనుకే కోర్టుకు వెళ్లామన్న నిమ్మగడ్డ.. న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మాపై కేసు పెట్టారన్న నిమ్మగడ్డ.. తమ సామగ్రి తీసుకెళ్లారు, సిబ్బందిని భయపెట్టారున్నారు. బెదిరింపులకు బెదిరితే వ్యవస్థ పలుచన అవుతుందని.. మీ సంగతేంటో చూస్తామన్నట్లు వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: