అమరావతి : జగన్ కు పెద్ద తలనొప్పిగా తయారయ్యారా ?

Vijaya


రాబోయే ఎన్నికల్లో వైసీపీకి బాగా తలనొప్పులు తెచ్చే నియోజకవర్గాల్లో గన్నవరంను మొదటగా చెప్పుకోవాలేమో. ఈ నియోజకవర్గంలో నేతల మధ్య వివాదాలను సర్దుబాటు చేయటానికి స్వయంగా జగన్మోహన్ రెడ్డి పూనుకున్నా కుదరటంలేదు. తాజాగా దుట్టా, యార్లగడ్డ వర్గాలు సమావేశమవ్వటం నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికి మూడు సార్లు నేతలను పిలిపించి పంచాయితీలను చేసినా నేతలు ఏమాత్రం వెనక్కు తగ్గటంలేదు. జగన్ దగ్గర పంచాయితి జరిగినపుడు అంతా ఓకే అంటారు. కొద్దిరోజులు పోయిన తర్వాత మళ్ళీ గొడవలు మామూలే.



ఇంతకీ విషయం ఏమిటంటే వైసీపీలో మొదటినుండి యార్గగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు గట్టిగా పనిచేసుకుంటున్నారు. పోయిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ మీద పోటీచేసిన యార్గగడ్డ ఓడిపోయారు. అయితే టీడీపీ తరపున పోటీచేసి గెలిచిన వంశీ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. దాంతో యార్లగడ్డకు ఏమిచేయాలో అర్ధంకాలేదు. మొదటినుండి యార్లగడ్డ-దుట్టా వర్గాలకు ఏమాత్రం పడదు. అయితే వంశీ వైసీపీకి దగ్గరవ్వటంతో పార్టీలో ఇపుడు మూడు వర్గాలు తయారయ్యాయి.



ఎప్పుడైతే వంశీ వైసీపీకి దగ్గరయ్యారో వెంటనే యార్లగడ్డ-దుట్టా వర్గాలు ఒకటయ్యాయి. అంటే వంశీకి వ్యతిరేకంగా శతృవులిద్దరు ఏకమయ్యారు. అప్పటినుండి వీళ్ళ మధ్య గొడవలు జరుగుతునే ఉన్నాయి. వీళ్ళమధ్య గొడవలను సర్దుబాటు చేయటానికి జగన్ ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఈ నేపధ్యంలోనే యార్లగడ్డకు కృష్ణా జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్ గా నియమించారు. దుట్టాకు ఎంఎల్సీ హామీఇచ్చిన జగన్ వంశీని ఎంఎల్ఏ టికెట్ ప్రకటించారు. అప్పుడు సరేఅని చెప్పి ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న యార్లగడ్డ, దుట్టాలు మళ్ళీ గొడవలు మొదలుపెట్టారు.




తాజాగా వంశీకి వ్యతిరేకంగా రెండువర్గాలు సమావేశమయ్యాయి. వంశీని ఎట్టిపరిస్ధితుల్లోను ఎంఎల్ఏ అభ్యర్ధిగా ఆమోదించేదిలేదని నిర్ణయించారు. అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీచేసైనా వంశీని ఓడించాలని యార్లగడ్డ డిసైడ్ అయినట్లు ప్రచారం మొదలైంది. జగన్ చెప్పిందానికి అంగీకరించి మళ్ళీ గొడవలు పడుతున్నారంటే యార్లగడ్డ, దుట్టాల వెనుక టీడీపీ హస్తం ఉందేమో అని వైసీపీలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొత్తానికి ఈ నియోజకవర్గం జగన్ కు పెద్ద తలనొప్పిగా తయారైందనటంలో సందేహంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: