బీజింగ్ : ఎన్నికోట్లమందికి కరోనా సోకిందో తెలుసా ?

Vijaya



చేసిన పాపం ఊరికేపోదని పెద్దలు ఒక మాట చెబుతుంటారు. ఇపుడు చైనాలో పరిస్ధితులను చూస్తుంటే ఆ మాట నిజమే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే డ్రాగన్ దేశంలో కోట్లమంది కరోనా వైరస్ బీఎఎఫ్-7 వేరియంట్ దెబ్బకు అల్లాడిపోతున్నారు. తాజా పరిస్ధితిని బట్టి దేశంలో సుమారు 25 కోట్లమందికి కరోనా వైరస్ సోకింది. ప్రతిరోజు చాలా నగరాల్లో లక్షలాది కేసులు వెలుగుచూస్తున్నాయి.



దేశంలో పెరిగిపోతున్న కేసుల దెబ్బకు జనాలు వణికిపోతున్నారు. డిసెంబర్ 1-20 తేదీల మధ్య తక్కువలో తక్కువ 25 కోట్లమందికి కరోనా సోకిందని జాతీయ ఆరోగ్య కమీషన్ వర్గాల ద్వారా లీకైన డాక్యుమెంట్ల ద్వారా బయటపడింది. ఆసుపత్రుల్లో కిటకిటలాడుతున్న రోగులు, శ్మశానాల్లో గుట్టలుగా పేరుకుపోయిన మృతదేహాలను చూసిన తర్వాత లీకైన డాక్యుమెంట్లు నిజమే చెప్పినట్లు అందరికీ అర్ధమవుతోంది. ఆసుపత్రుల్లోని మార్చురీలు కూడా డెడ్ బాడీలతో నిండిపోతున్నాయి.



బాధాకరం ఏమిటంటే ఆసుపత్రులకు వస్తున్న రోగుల కారణంగా డాక్టర్లు, వైద్య సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకుతోంది. వస్తున్న రోగులను దృష్టిలో పెట్టుకుని డాక్టుర్లు, వైద్యసిబ్బంది తమకు కరోనా వైరస్ ఉన్నా కూడా వైద్యం చేయక తప్పటంలేదు. దీనివల్ల ఎవరి వల్ల ఎవరికి వైరస్ సోకుతోంది ? కరోనా ఎప్పుడు తగ్గుతుందో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. రోగులు ఎంతో అవసరమైతే తప్ప ఆసుపత్రులకు రావద్దని, ఆన్ లైన్లోనే వైద్యం చేయించుకోవాలని, మార్కెట్లో మందులు కొనుక్కోమని ప్రభుత్వం చెబుతున్నా జనాలు వినకుండా ఆసుపత్రులకు వచ్చేస్తున్నారు.



షాన్ డాంగ్ ప్రావిన్స్ లోని క్విండావో నగరంలో అయితే రోజుకు ఏకంగా 5 లక్షల కేసులు నమోదవుతున్నట్లు సిటీ హెల్త్ కమీషన్ చీఫ్ బో తావో చెప్పారు. గువాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని డాంగువాన్ నగరంలో రోజుకు 3 లక్షల కేసులు వస్తున్నాయి. రోగుల్లో చాలామంది ముసలివాళ్ళే ఉండటంతో అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది. మొత్తానికి ఒకపుడు ప్రపంచదేశాలకు కరోనా వైరస్ ను అంటించేసి వేడుక చూసిన చైనా ఇపుడు అదే కరోనా దెబ్బకు వణికిపోతోంది. రోగులే 25 కోట్లమందంటే వీరిలో ఎంతమంది చనిపోతారో ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: