అమరావతి : పవన్ అసలు అజెండా ఇదేనా ?

Vijaya

‘ఎన్ కౌంటర్ చేసుకోండి భయపడేదే లేదు...కొట్టుకుంటేకొట్టుకోండి..తిట్టుకుంటే తిట్టుకోండి..అరెస్టు కూడా చేసుకోండి అన్నింటికీ తెగించిన వాణ్ణి దేనికీ భయపడేవాడిని కాను. ఎన్ కౌంటర్ కే భయపడనివాణ్ణి అరెస్టులకు భయపడతానా’ ? ఇవి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలీసులను ఉద్దేశించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఇప్పటం గ్రామంలో కూల్చివేతలకు మద్దతుగా పోలీసులతో పాటు ప్రభుత్వంపైన కూడా తీవ్రస్ధాయిలో పవన్ రెచ్చిపోయారు. తాజాగా విజయనగరం పర్యటనలో కూడా ప్రభుత్వంపై మండిపోయారు.నిజానికి ఇప్పటం గ్రామంలో కూల్చివేతలకు నిరసనగా ఇంత సీన్ చేయాల్సిన అవసరంలేదు. విజయనగరం పర్యటనలో రెచ్చిపోవాల్సిన అవసరమూ లేదు. ఇళ్ళను కూల్చేస్తున్నట్లు పవన్, చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా నానా గోలచేస్తున్నారు. ఇదేసమయంలో రోడ్లను ఆక్రమించుకుని కట్టుకున్న ఇళ్ళకాంపౌడ్ గోడలను మాత్రమే కూలుస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కొందరు గ్రామస్తులు కూడా ఇదే చెబుతున్నారు. రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉన్నాయి కాబట్టే ఆక్రమణలను తొలగించాలని ఏప్రిల్ నెలలోనే ఇచ్చిన నోటీసులను కూడా ప్రభుత్వం చూపిస్తోంది. అయినా పవన్ మాత్రం పదేపదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోతునే ఉన్నారు.
సరే కూల్చివేతల్లో ఎవరివాదన నిజమన్నది పక్కనపెట్టేస్తే పవన్ మాత్రం పక్కాప్లాన్ తోనే గొడవ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఏచిన్న అవకాశం దొరికినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచ్చరచ్చ చేయాలన్నదే అజెండాగా పెట్టుకున్నట్లు కనబడుతోంది. పవన్ అజెండా వెనుక చంద్రబాబు ఉన్నారేమో అనే అనుమానాలు గతంలో ఉండేవి. కానీ ఇపుడేమో ఎవరి హస్తముందో అర్ధం కావటంలేదు.  ఎందుకంటే పూనకం వచ్చినట్లు పవన్ ఊగిపోయేస్ధాయిలో చంద్రబాబు ఊగలేరు. రోడ్లమీదకొచ్చి గోల చేయలేరు.సినీ సెలబ్రిటి కాబట్టి పవన్ రోడ్డుమీదకు వస్తే అభిమానులు గుమిగూడుతారు. ఎన్నివేషాలు వేసినా చెల్లుబాటవుతుంది. అదే చంద్రబాబు ఇలాంటి గొడవలు చేస్తే చిల్లరగా ఉంటుంది. పైగా జనాలూ నమ్మటంలేదు. అందుకనే ఇద్దరు మాట్లాడుకుని పవన్ను ముందుపెట్టి వెనకనుండి చంద్రబాబు షో రన్ చేస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోయాయి.  ఏదోరకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొట్టడమే అజెండాగా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. అందుకనే తిట్టుకోండి, కొట్టుకోండి, అరెస్టుచేయండి, ఎన్ కౌంటర్లు చేసుకోండంటు అసందర్భంగా పోలీసులను రెచ్చగొడుతున్నది.  ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఇంకెంత ఓవర్ యాక్షన్ చూడాల్సొస్తుందో ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: