అమరావతి : జనాల ఛాయిస్ తెలీకే టెన్షన్ పెరిగిపోతోందా ?

Vijaya





ఏపీ రాజకీయమంతా చాలా విచిత్రంగా ఉంది. పార్టీల అధినేతలందరూ ఛాన్సుల చుట్టూ తిరుగుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ మాట్లాడినా వచ్చే ఎన్నికల్లో జనసేనను గెలిపించమని అడుగుతున్నారు. మంచి పరిపాలన అంటే ఏమిటో నిరూపించేందుకు తనకు ‘ఒక్కఛాన్స్’ ఇవ్వమని అడుగుతున్నారు. తాజాగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు మాట్లాడుతు రాబోయే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు కాబట్టి ‘లాస్ట్ ఛాన్స్’ ఇవ్వమని జనాలను బతిమలాడుకుంటున్నారు.



ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి బహిరంగసభల్లో మాట్లాడుతు తనకు ‘మరో ఛాన్స్’ ఇవ్వమని అడుగుతున్నారు. చంద్రబాబు లాస్ట్ ఛాన్సివ్వమని ఎలా అడుగుతున్నారంటే సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అంటే వయసురీత్యా రాబోయే ఎన్నికలే చివరివని, ముఖ్యమంత్రిగా మాత్రమే తాను అసెంబ్లీలోకి అడుగుపెడతానని చేసిన శపథాన్ని జనాలకు చంద్రబాబు గుర్తుచేస్తున్నారు. తన శపథం నెరవేరాలంటే జనాలంతా తనకు చివరి ఛాన్స్ ఇవ్వాలని సెంటిమెంటును ప్రయోగిస్తున్నారు.ఈ నేపధ్యంలోనే నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు.



జగన్ మాత్రం తన పరిపాలనలో మంచి జరిగిందని జనాలు అనుకుంటే మళ్ళీ తనకే ఓట్లేసి గెలిపించాలని అడుగుతున్నారు. చంద్రబాబు లాగ జగన్ సెంటిమెంటును ప్రయోగించటంలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలుస్తుందనే ధీమాను వ్యక్తంచేస్తున్నారు. ప్రజల బాగుకోసం సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నాం కాబట్టి కచ్చితంగా 175కి 175 సీట్లూ వైసీపీనే గెలవాలని సమీక్షా సమావేశాల్లో గట్టిగా చెబుతున్నారు. 175 సీట్లూ వైసీపీ గెలుస్తుందని కాదుకానీ జగన్లోని కాన్ఫిడెన్సు లెవల్స్ ని తెలియజేస్తోంది.



ఇదే సమయంలో చంద్రబాబు మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనబడుతోంది.  ఇక పవన్ అంటారా పార్టీ నిర్మాణమే జరగలేదు. 175 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులే లేరు. ఏరోజు ఎలాగ మాట్లాడుతాడో తనకే తెలీదు. విషయపరిజ్ఞానం లేకపోవటమే మైనస్ అనుకుంటే మాట స్ధిరత్వం కూడా లేకపోవటం పెద్ద సమస్యగా మారింది. ముగ్గురు అధినేతలను జనాలు బాగా దగ్గరగా పరిశీలిస్తున్నారు. కాబట్టి చివరాఖరుకు జనాలు ఛాన్స్ ఎవరికిస్తారనే చర్చ  పెరిగిపోతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: