అమరావతి : మార్గదర్శిలో సోదాలు...ఒకేదెబ్బకు రెండుపిట్టలా ?

Vijaya



మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆఫీసుల్లో ప్రభుత్వ అధికారులు సోదాలు జరపటం సంచలనంగా మారింది. మార్గదర్శి అంటే ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మార్గదర్శిలో సోదాలు జరపాలంటే అధికారులకు ఎంత ధైర్యముండాలి. అందుకనే సంస్ధపెట్టిన దగ్గరనుండి ఏ ప్రభుత్వ సంస్ధ కూడా సోదాలపేరుతో అడుగుకూడా పెట్టలేదు. అలాంటిది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నతాధికారులు చిట్ ఫండ్, ఫైనాన్స్ సంస్ధలపై హఠాత్తుగా దాడులుచేశారు. ఇందులో భాగంగానే మార్గదర్శి చిట్ ఫండ్స్ లో కూడా సోదాలు జరిగాయి.



నిజానికి చిట్ ఫండ్స్ సంస్ధలు, ఫైనాన్స్ సంస్ధల్లో సోదాలనేది పేరుకుమాత్రమే. అసలు టార్గెట్ మాత్రం మార్గదర్శనే చెప్పాలి. నరేంద్రమోడీ విశాఖపట్నం పర్యటన ముగిసిన వెంటనే రెండు డెవలప్మెంట్లు జరిగాయి. మొదటిదేమో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిలో మార్పొచ్చేసింది. పవన్ మాటలుచూస్తుంటే వచ్చే ఎన్నికల్లో సింగిల్ గానే పోటీచేయటానికి ప్రిపేర్ అవుతున్నట్లే అనిపిస్తోంది. ఇక రెండో డెవలప్మెంట్ ఏమిటంటే మార్గదర్శి ఆఫీసుల్లో సోదాలు.



మార్గదర్శిలో సోదాలు జరిగాయంటే దేనికి సంకేతాలు. అదికూడా మోడీ పర్యటన ముగిసిన మూడోరోజే. ఎక్కడో తేడా కొడుతోందని అనిపించటంలేదా ? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిరోజు బురదచల్లటమే రామోజీరావు టార్గెట్ గా పెట్టుకున్నారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా రామోజీకి చెందిన మార్గదర్శి జనాల దగ్గర భారీఎత్తున డబ్బులు వసూలుచేసిందనే విషయమై సుప్రింకోర్టులో విచారణజరుగుతోంది. మార్గదర్శి మోసం నిర్ధారణయ్యిందని, న్యాయవ్యవస్ధ తనపని తాను చేసుకుపోతే రామోజీకి వేలకోట్ల రూపాయల ఫైన్ తో పాటు జైలుశిక్ష ఖాయమని మార్గదర్శిపై పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలాసార్లు చెప్పారు. 



ఇక్కడ విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడి ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా జగన్ పై రామోజీ బురదచల్లేస్తున్నారు. ఇపుడు మార్గదర్శిలో అవకతవకలు నిర్ధారణై రామోజీని గనుక దెబ్బకొడితే ఆ దెబ్బ కచ్చితంగా చంద్రబాబుపైనా పడుతుంది.  ఒకేసారి ఇటు రామోజీని అటు చంద్రబాబును లేవకుండా జగన్ దెబ్బకొట్టినట్లవుతుంది. మరి తాజా సోదాల్లో ఏమి బయపడిందనేది ఆసక్తిగా మారింది. ఈ సోదాల్లో బయటపడే అంశాలు సుప్రింకోర్టు విచారణలో ప్రభుత్వానికి ఉపయోగంగా ఉంటుంది. మరి జగన్ దెబ్బకు ఒకేసారి రెండుపిట్టలు పడతాయా ?




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: