అమరావతి : పవన్ను బీజేపీ ఓ ఆటాడుకుంటోందా ?

Vijaya






మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బీజేపీ ఒక ఆటుడుకుంటున్నట్లే ఉంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీతో కలిసి పోరాటం చేయమని చెబుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక పథకాలు, కార్యక్రమాలు బ్రహ్మాండమని కితాబిస్తోంది. జగనన్న కాలనీల నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని పవన్, జనసేన నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. వీళ్ళకి లబ్దిదారులే తమదైన పద్దతిలో సమాధానమిస్తున్నారు.



జగనన్న ఇళ్ళు లబ్దిదారుల కన్నీళ్ళు అనే కార్యక్రమాన్ని మిత్రపక్షమైన జనసేన నిర్వహిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ జగనన్న హౌసింగ్ కాలనీల పథకాన్ని ఆకాశానికెత్తేశారు. ఏపీలో జగన్ అమలుచేస్తున్న ఇళ్ళనిర్మాణ పథకాన్ని యావత్ దేశం రోల్ మోడల్ గా తీసుకోవాలని పిలుపిచ్చారు. పథకం అమలుతీరును వివిధ రాష్ట్రాలు అధ్యయనంచేయాలన్నారు. తమరాష్ట్రాల్లో కూడా ఇదే కాన్సెప్టును ఫాలో అవ్వాలన్నారు.



ఇళ్ళ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని జనసేన  ఒకవైపు ఆందోళనలు చేస్తుంటే మరోవైపు కేంద్రం ప్రభుత్వం ఇదే పథకం అమలు భేషంటు కితాబివ్వటం పవన్ కు పెద్ద షాక్ కొట్టినట్లయ్యింది. స్వయంగా కేంద్రమే జగనన్న కాలనీల నిర్మాణ పథకాన్ని మెచ్చుకోవటంతో బీజేపీ ఇక మాట్లాడేందుకు ఏమీలేదు. అలాగే పరిశ్రమల ఏర్పాటులో జగన్ ప్రభుత్వం ఫెయిలైందని పవన్ గోలచేస్తున్నారు. అయితే ఏపీలో పరిశ్రమల ఏర్పాటు ప్రోత్సాహకంగా ఉందని కేంద్రం అభినందించింది.




ఇక రాజకీయంగా కూడా పవన్ ముందడుగు వేసేందుకు లేకుండా నరేంద్రమోడీ బ్రేకులు వేసేశారు. మిత్రపక్షంగా టీడీపీని కలుపుకునిపోవాలని పవన్ చెబితే నరేంద్రమోడీ అంగీకరించలేదని తెలిసింది. బీజేపీతోనే సమన్వయం చేసుకుని పోరాటాలు చేయాలని స్పష్టంగా చెప్పేశారట. ఏపీలో జగన్ పాలనగురించి చెప్పగానే ఐనో ఎవ్రిథింగ్ అంటు కట్ చేసేశారు. ఇలా అడుగడుగునా పవన్ కు బీజేపీ షాకిస్తునే ఉంది. హోలు మొత్తంమీద చూస్తే పవన్ను బీజేపీ ఓ ఆటాడుకుంటున్నట్లే ఉంది. మరి ఈ ఆటలో విజేతగా ఎవరు నిలుస్తారో చూడాల్సిందే.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: