చంద్రబాబు రైతులను దగా చేశాడు: జగన్

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం నాడు వ్యవసాయం, అనుబంధ రంగాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. గత 40 నెలల్లో వ్యవసాయ రంగంలో  మొత్తం రూ.1,28,634 కోట్లు ఖర్చు చేశామని జగన్ తెలిపారు.గత మూడు సంవత్సరాలలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని.. సగటున 167.99 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని వెల్లడించారు. రైతు భరోసా ద్వారా 52 లక్షల 38 వేల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించామన్నారు. రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు అందించామని పేర్కొన్నారు. ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టాన్ని ఆ సీజన్‌లోనే చెల్లిస్తున్నామని.. దేశంలో ఎక్కడా లేనివిధంగా వాస్తవ సాగుదారులకే బీమా రక్షణ కల్పిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. గత మూడేళ్లలో ఒక్క మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు.

చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కరవు ఉండేదని.. కరవు, చంద్రబాబు ఇద్దరూ కవలలు అని జగన్ ఎద్దేవా చేశారు. తన హయాంలో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చెరువులు, వాగులు, వంకలు కళకళలాడుతున్నాయని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో ఐదు ప్రధాన నదులు పరవళ్లు తొక్కుతున్నాయని కృష్ణా, గోదావరి డెల్టాలతో పాటు రాయలసీమ, రైతులకు అత్యధికంగా సాగునీరు అందుతుందన్నారు. గత మూడేళ్లలో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు. సగటున 13.29 లక్షల టన్నుల దిగుబడి పెరిగిందని వైసీపీ హయాంలో రైతులే కాదు రైతు కూలీలూ సంతోషంగా ఉన్నారన్నారు. ఆర్బీకేలతో వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు.

చంద్రబాబు హయాంలో రైతులకు బీమా పరిహారం అందలేదని ఆరోపించారు. సున్నా వడ్డీ కింద నేరుగా రైతుల ఖాతాల్లో వడ్డీ జమ చేస్తున్నామని.. రైతులకు వడ్డీ రాయితీ నవంబర్‌లో అందిస్తామని చెప్పారు. గత మూడేళ్లలో 65.65 లక్షల మంది రైతులకు రూ.1,282 కోట్లు చెల్లించామన్నారు. బాబు పెట్టిన బకాయిలు రైతులకు తామే చెల్లించామని పేర్కొన్నారు. రుణమాఫీపై చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చారని.. రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని వాగ్ధానం చేశారని… రుణమాఫీ చేయకుండా ఆయన రైతులను దగా చేశారని విమర్శించారు. చివరికి రైతులకు సున్నా వడ్డీని కూడా ఎగ్గొట్టారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి నాయకుల వల్లే మేనిఫెస్టోకు విలువ లేకుండా పోతోందని ముఖ్య మంత్రి జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: