హైదరాబాద్ : రాజగోపాల్ కు చుక్కలు కనబడుతున్నాయా ?

Vijaya






బీజేపీ అభ్యర్ధిగా మునుగోడు ఉపఎన్నికలో గెలవటం చాలా సులభమని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అనుకున్నట్లున్నారు. తాను బీజేపీలో చేరినా కాంగ్రెస్ క్యాడర్+నేతలు తనతోనే వస్తారని కాబట్టి గెలుపు నల్లేరుమీద నడకే అన్నట్లుగా మాట్లాడేవారు. నామినేషన్ వేయటం ఆలస్యం గెలిచిపోయినట్లే అన్నంత ధీమాతో మాట్లాడారు. అయితే ఇపుడు ప్రచారం చేస్తుంటే కొన్నిచోట్ల తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రచారంలో రెండుమూడు గ్రామాల జనాలు చుక్కలు చూపించారు.



సంస్ధాన్ నారాయణపూర్ మండలంలోని మర్రిగూడెంలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. పూజల తర్వాత అన్నదానం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు+ప్రచారం చేసుకునేందుకు రాజగోపాల్ ఆ గ్రామానికి వెళ్ళారు. అయితే మాజీ ఎంఎల్ఏ రాకను గమనించిన జనాలంతా ఆయన్ను మొదట్లోనే నిలిపేశారు. తమ గ్రామంలోకి అడుగుపెట్టేందుకు లేదని, ప్రచారం చేస్తే ఒప్పుకునేదిలేదని స్పష్టంగా చెప్పేశారు.




దీనికి కారణం ఏమిటంటే కాంగ్రెస్ ఎంఎల్ఏగా పోటీచేసినపుడు అంటే 2018లో ఈ గ్రామానికి కొన్ని హామీలిచ్చారట. తన ప్రచారంలో భాగంగా గ్రామంలో సిమెంటురోడ్లు, వాటర్ ట్యాంకు నిర్మిస్తామన్నారట. ప్రభుత్వం చేయకపోతే సొంత డబ్బులైనా ఖర్చుపెట్టి హామీలు నెరవేరుస్తామని చెప్పారట. ఆ ఎన్నికల్లో రాజగోపాల్ గెలిచారుకానీ మళ్ళీ గ్రామంవైపు చూడలేదట. ఇపుడు ఉపఎన్నికలో పోటీచేస్తున్నారు కాబట్టే ఇపుడు గ్రామంలోకి వచ్చిన రాజగోపాల్ పై జనాలంతా మండిపోయారు.



అప్పట్లో ఇఛ్చిన హామీని నిలబెట్టుకుని మళ్ళీ గ్రామంలోకి అడుగుపెట్టమని గట్టిగానే చెప్పారట. రాజగోపాల్ ఏదో మాట్లాడుదామని ప్రయత్నంచేసినా జనాలు పట్టించుకోలేదట. పైగా వెంటనే మాజీ ఎంఎల్ఏని గ్రామంవదిలి వెళ్ళిపోవాలని గట్టిగా చెప్పారట. దాంతో చేసేదిలేక రాజగోపాల్ గ్రామంనుండి వెళ్ళిపోయారు. ఇదే విధమైన పరిస్ధితి నాలుగు రోజుల క్రితం కూడా ఎదురైంది. వేరే గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలే రాజగోపాల్ ను ప్రచారం చేసుకోనీయకుండా ఊరినుండి తరిమేశారు. చూస్తుంటే రాజగోపాల్ గెలుపు ఆయన అనుకున్నట్లు నల్లేరుమీద నడక కాదన్నట్లుగానే కనిపిస్తోంది. పైగా కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని అభ్యర్ధిగా ఎంపికచేసింది. దీంతో రాజగోపాల్ కు తలనొప్పులు మరింత ఎక్కువయ్యేట్లే ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: