హైదరాబాద్ : ఎంపీపై రివర్స్ గేమ్ ప్లేచేసిందా ?

Vijaya






మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధిని కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టబట్టిన పాల్వాయి స్రవంతికే సోనియాగాంధి టికెట్ కేటాయించారు. శుక్రవారం మధ్యాహ్నం ఏఐసీసీ అధికారికంగా స్రవంతిని మునుగోడు అభ్యర్ధిగా ప్రకటించింది. ఉపఎన్నికలో పోటీచేయటానికి స్రవంతితో పాటు చల్లమల్ల కృష్ణారెడ్డి మరో ఇద్దరు ప్రయత్నాలు చేసుకున్నారు. వీరిలో చివరకు స్రవంతి, కృష్ణారెడ్డే రేసులో నిలిచినా చివరకు అధిష్టానం స్రవంతి వైపే మొగ్గుచూపింది.



కృష్ణారెడ్డిని అభ్యర్ధిని పోటీచేయించాలని రేవంత్ గట్టిగా పట్టుబట్టారు. రేవంత్ కు తెలంగాణా ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ కూడా మద్దతు తెలిపారు. ఇదే సమయంలో స్రవంతిని భువనగిరి ఎంపీ, సీనియర్ నేత, రేవంత్ బద్ద వ్యతిరేకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదించారు. ఎంపీకి మద్దతుగా మరికొందరు నేతలు కూడా నిలిచారు. సరే తెరవెనుక చాలా మంతనాలు జరిగిన తర్వాత చివరకు అధిష్టానం  స్రవంతికే టికెట్ ప్రకటించింది.



ఇక్కడ అధిష్టానం ఆలోచన ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ రేవంత్ ప్రతిపాదించిన నేతకు టికెట్ ఇస్తే ఎంపీ పనిచేస్తారో లేదో అనే అనుమానం వచ్చినట్లుంది. అదే ఎంపీ ప్రతిపాదించిన స్రవంతికి టికెట్ ఇస్తే రేవంత్+మద్దతుదారులు ఎలాగూ పనిచేస్తారు. తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరినట్లే అన్న, ఎంపీ అయిన వెంకెటరెడ్డికి కూడా బీజేపీలోకి చేరిపోతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఎంపీ బీజేపీలో చేరుతారో లేదో తెలీదుకానీ ముందు  ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించుకోవటమే టార్గెట్ అయ్యింది.



తాను చెప్పిన అభ్యర్ధికి టికెట్ ఇస్తే గెలిపించుకొస్తానని వెంకటరెడ్డి హామీ ఇచ్చారని సమాచారం. అందుకనే వెంకటరెడ్డి మాట నిలబెట్టుకుంటారో లేదో చూసేందుకే అధిష్టానం కూడా ఎంపీ ప్రతిపాదించిన అభ్యర్ధికే టికెట్ ఖాయంచేసింది. మరి తానడిగిన క్యాండేట్ కే అధిష్టానం టికెట్ ఇచ్చిందికాబట్టి ఎంపీ ఏమి చేస్తారో చూడాలి. తాను ప్రతిపాదించిన స్రవంతికి అధిష్టానం టికెట్ ఇవ్వదనే నమ్మకంతో ఎంపీ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని అడ్డంపెట్టుకుని ఏదో చేద్దామని వెంకటరెడ్డి అనుకున్నారట. అలాంటిది అధిష్టానం ఉల్టాగా ఆలోచించి ఎంపీ క్యాండిడేటు వైపే మొగ్గుచూపటంతో ఉపఎన్నిక మంచి రసకందాయంలో పడింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: