అమరావతి : ఇందుకేనా పార్టీలో ఇంత గందరగోళం ?

Vijaya






తెలుగుదేశంపార్టీలో విచిత్రమైన పరిస్ధితులు కనబడుతున్నాయి. వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో చంద్రబాబునాయుడుకి మెజారిటి నేతలకు మధ్య ఆలోచనల్లో చాలా తేడా కనబడుతున్నదట. చంద్రబాబు ఏమో పొత్తుల్లేకుండా ఎన్నికలను ఎదుర్కోవటం కష్టమని మానసికంగా డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే పొత్తుల్లేకుండా ఎన్నికలను ఎదుర్కుంటే ఏమవుతుందో 2019లో ఎదురైన ఘోర ఓటమే సాక్ష్యంగా నిలిచింది. అందుకనే పదే పదే జనసేన, బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారు.




ఇదే సమయంలో మెజారిటి నేతలేమో ఏ పార్టీతోను పొత్తు వద్దవద్దంటున్నారు. ఒంటరిగా పోటీచేసి గెలిచేసత్తా ఉన్నపుడు మళ్ళీ పొత్తులకోసం ఎందుకు వెంపర్లాడాలన్నది తమ్ముళ్ళ ఆలోచన. ఇతరపార్టీలతో పొత్తుల కోసం ఆలోచించేకొద్దీ వాళ్ళు టీడీపీని చాలా చులకనగా చూస్తున్నారని చాలామంది తమ్ముళ్ళు చంద్రబాబుకు నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారట. పొత్తులపేరుతో అనవసరంగా ఎంఎల్ఏ, ఎంపీ సీట్లను వదులుకుని నష్టపోవటం తప్ప జరిగేది ఏమీలేదని కూడా తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారట.




అయితే తమ్ముళ్ళు ఎంత చెబుతున్నా చంద్రబాబు మాత్రం ఒంటరిగా పోటీచేసేంత ధైర్యం చేయలేకపోతున్నారు. ఇక్కడే చంద్రబాబులోను తమ్ముళ్ళలోను వైరుధ్యమైన ఆలోచనలు కనబడుతున్నాయి. చంద్రబాబు ఆలోచన ఏమిటంటే అవసరమైతే కొన్నిసీట్లను త్యాగం చేసైనా సరే ఎలాగైనా అధికారంలోకి వచ్చి తీరాలన్నది టార్గెట్. ఎందుకంటే వచ్చే ఎన్నికలే రాజకీయంగా బహుశా చంద్రబాబుక చివరి ఎన్నికలనేట్లుంది. వచ్చే ఎన్నికల్లో గనుక అధికారంలోకి రాకపోతే టీడీపీ పని తెలంగాణాలో అయినట్లే అయిపోతుంది.



ఇదే సమయంలో తమ్ముళ్ళ ఆలోచన ఏమిటంటే పార్టీకోసం లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకుని చివరకు ఎన్నికలనాటికి పొత్తులని తమకు టికెట్లు లేకపోతే ఏమిచేయాలనేది పెద్ద సమస్య అయిపోయింది. ఒకవైపేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపేమో పొత్తులకోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు. రేపు పొత్తుకుదిరితే ఎన్నిసీట్లు, ఎవరి నియోజకవర్గాలు పొత్తులు వెళిపోతాయో ఎవరికీ తెలీదు. మరింత కష్టపడి పనిచేసేది, లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకుని చివరకు సీటులేదంటే ఎలాగన్నది తమ్ముళ్ళ పాయింట్. ఇద్దరి ఆలోచనలు కరెక్టుగానే కనిపిస్తుంది. అందుకనే పార్టీలో ఇంత గందరగోళంగా తయారైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: