వరద భయంలో భద్రాచలం..

Deekshitha Reddy
గత నెలలో వచ్చిన వానలు, వరదలు తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఈ నెలలో కూడా వరదలు చుట్టుముట్టాయి. అయితే వానలు లేకపోవడం గొప్ప ఊరట. కానీ వరద ప్రవాహం ఎక్కువ కావడంతో గోదావరి పరివాహక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నెలరోజుల వ్యవధిలో గోదావరి రెండోసారి ఉగ్రరూపం దాల్చడంతో తీరప్రాంతంలో జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎటు నుంచి ముంపు ముప్పు వస్తుందోనని భయపడిపోతున్నారు. రెండు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నారు వారంతా.
ప్రస్తుతం భద్రాచలం వద్ద వరద ప్రవాహం పెరుగుతూ తగ్గుతూ ఉంది. ఈ ఉదయానికి 51.5 అడుగుల మేర వరద ప్రవాహం ఉంది. అయితే ఈసారి ప్రవాహం పైనుంచి పెద్దగా రావడంలేదు. పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం దగ్గర వరద నీటిమట్టం పెరిగింది. అటు శబరి నీటి ప్రవాహం కూడా ఎక్కువ కావడంతో భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. మరో 48 గంటల వరకు పరిస్థితి చెప్పలేమంటున్నారు అధికారులు. అందుకే అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
ఈసారి వరుణుడు కాస్త కరుణించాడని అంటున్నారు. దీంతో తిరుగు జలాలతో భద్రాచలానికి మాత్రం ఇబ్బంది లేదు. ప్రవాహం లేకుండా ఉంటే.. మరో రెండ్రోజుల్లో నీటిమట్టం తగ్గిపోతుంది. కానీ పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావాన్ని మాత్రం అంచనా వేయలేకపోతున్నారు అధికారులు.
వ్యాధులతో అప్రమత్తం..
మరోవైపు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో 173 మలేరియా, 76 డెంగీ కేసులు నమోదయ్యాయి. గత నెల నుంచి వ్యాధుల విజృంభణ పెరిగింది. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో మలేరియా, డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు అధికారులు. ఇప్పటికే 215 వరద ప్రభావిత గ్రామాల్లో దోమల మందును పిచికారీ చేశారు. వరదొచ్చి తగ్గిన వెంటనే ప్రత్యేక పారిశుధ్య చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలిచ్చారు. దోమతెరల పంపిణీ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: